ముంబై రైలు పేలుళ్ల కేసులో 12 మంది నిర్దోషులే .. బాంబే హైకోర్టు సంచలన తీర్పు

ముంబై రైలు పేలుళ్ల కేసులో 12 మంది నిర్దోషులే .. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
  • 2006 జులై 11న ముంబై సబర్బన్​ ట్రైన్లలో వరుసగా బాంబు పేలుళ్లు
  • 189 మంది మృతి..800 మందికి పైగా గాయాలు
  • ఈ కేసులో 2015లో ఐదుగురికి ఉరిశిక్ష, ఏడుగురికి జీవిత ఖైదు విధించిన ట్రయల్​ కోర్టు
  • స్పెషల్​ కోర్టు తీర్పుపై హైకోర్టుకు దోషులు..
  • 19 ఏండ్ల తర్వాత నిర్దోషులుగా తేల్చిన కోర్టు
  • కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్​ విఫలమైందని వ్యాఖ్య

ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2006 ముంబై రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న 12 మందిని 19 ఏండ్ల తర్వాత నిర్దోషులుగా ప్రకటించింది. వారిపై ఉన్న అభియోగాలను నిర్ధారించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని చెప్పింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను పక్కన పెడుతున్నట్టు జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చందక్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొన్నది. దర్యాప్తు సమయంలో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మ్యాప్‌లు పేలుళ్లకు సంబంధం లేనివిగా కనిపిస్తున్నాయని తెలిపింది.

పేలుళ్లలో ఎలాంటి బాంబులను ఉపయోగించారో కూడా ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని పేర్కొంది. బాంబు పేలుళ్లు జరిగిన 100 రోజుల తర్వాత ఎవరైనా నిందితులను గుర్తుపట్టగలరా? అని ప్రశ్నించింది. ‘‘నిందితులపై కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైంది. నిందితులు నేరం చేశారని నమ్మడం కష్టం. అందువల్ల వారిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నాం” అని తెలిపింది.  నిందితులు మరే ఇతర కేసుల్లోనూ వాంటెడ్‌‌‌‌‌‌‌‌గా లేకపోతే వారిని జైలునుంచి వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.  

ముంబై సబర్బన్​ రైళ్లలో వరుస పేలుళ్లు

2006 జులై 11న ముంబై వెస్ట్​రైల్వేలోని లోకల్​ట్రెయిన్లలో 11 నిమిషాల్లో వరుసగా 7 సార్లు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 189 మంది  ప్రాణాలు కోల్పోయారు. మరో 800 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన ట్రయల్​కోర్టు 2015 అక్టోబరులో 12 మంది నిందితులను దోషులుగా తేల్చింది. ఇందులో ఐదుగురికి మరణశిక్ష, మిగతా ఏడుగురికి జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో వీరు ట్రయల్​ కోర్టు తీర్పుపై బాంబే హైకోర్టును ఆశ్రయించారు. వాటిని సవాల్‌‌‌‌‌‌‌‌ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసింది. అనేక అభ్యర్థనల తర్వాత 2024 జులైలో ఈ కేసు విచారణకు హైకోర్టు ప్రత్యేక బెంచ్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటుచేసింది. అప్పటినుంచి విచారణ జరిపిన ధర్మాసనం.. ఆ 12 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సోమవారం సంచలన తీర్పునిచ్చింది. కాగా, ఈ 12 మందిలో కమల్‌‌‌‌‌‌‌‌ అన్సారీ అనే వ్యక్తి 2021లో కొవిడ్‌‌‌‌‌‌‌‌ కారణంగా నాగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ జైల్లో మృతి చెందాడు. కోర్టు తీర్పులో మిగతా 11 మంది జైలునుంచి విడుదలకానున్నారు.

హైకోర్టు తీర్పును పరిశీలిస్తం: మంత్రి చంద్రశేఖర్

మొత్తం 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్నంగా పరిశీలిస్తుందని మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్​బవాంకులే పేర్కొన్నారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ కూడా ఈ తీర్పును పరిశీలిస్తారని చెప్పారు. ఆ తర్వాతే  సుప్రీంకోర్టులో సవాలు చేయాలా? వద్దా? అని నిర్ణయించుకుంటామని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఏదైనా అదనపు సమాచారం ఉంటే దాన్ని సీఎం ఫడ్నవీస్​ డిటెయిల్డ్‌‌‌‌‌‌‌‌గా ప్రజెంట్​​ చేస్తారని చెప్పారు. కాగా, రైలు బాంబు పేలుళ్లపై గతంలో పోలీసులు నిర్వహించిన దర్యాప్తులోని లోపాలను పరిష్కరించడానికి దర్యాప్తు అధికారులు, న్యాయ నిపుణులతో బృందాన్ని ఏర్పాటు చేయాలని సీఎంను బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య  విజ్ఞప్తి చేశారు.