భర్త, అత్తమామలపై తప్పుడు కేసులు క్రూరత్వమే : బాంబే హైకోర్టు

భర్త, అత్తమామలపై తప్పుడు కేసులు క్రూరత్వమే : బాంబే హైకోర్టు
  • విడాకుల రద్దుకు బాంబే హైకోర్టు నో 

ముంబై: భర్త, అత్తమామలతో పాటు అతని కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టడం క్రూరత్వమని బాంబే హైకోర్టు అభిప్రా యపడింది. విడాకులు పొందిన ఓ మహిళ తన వివాహ హక్కులను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ సందర్భంగా కొట్టివేసింది. ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను రద్దు చేయడానికి నిరాకరించింది. ఓ జంట 2004లో పెండ్లి చేసుకుని.. 2012 వరకు కలిసి జీవించారు. ఆ తర్వాత భార్య తన భర్తను వదిలేసి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. అంతేకాకుండా, తనను తన భర్త, మామ, భర్త సోదరుడు వేధించారని వారిపై తప్పుడు కేసులు పెట్టింది. దీంతో వారు జైలుకెళ్లారు.

కొంతకాలం తర్వాత నిర్దోషులుగా విడుదలయ్యారు. అయితే, తన భార్య తప్పుడు ఫిర్యాదుల కారణంగా తన కుటుంబ సభ్యులు, తాను మానసికంగా కుంగిపోయామని.. తనకు విడాకులు మంజూరు చేయాలని ఆ వ్యక్తి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన కోర్టు.. ఆ మహిళ ఫిర్యాదులో క్రూరత్వం ఉందని భావించి.. 2023, ఫిబ్రవరిలో వారికి విడాకులు మంజూరు చేసింది.

కాగా, ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను సవాల్​ చేస్తూ.. తన వివాహ హక్కులను పునరుద్ధరించాలని కోరుతూ ఆ మహిళ ముంబై హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ను జస్టిస్ వై జీ ఖోబ్రగాడే ఆధ్వర్యంలోని ఔరంగాబాద్ బెంచ్ విచారించింది. ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను సమర్ధిస్తూ..  ఆ మహిళ వేసిన పిటిషన్‌ను కొట్టేసింది.