వానలు పడ్తయ్.. పంటలు బాగా పండుతయ్ కానీ, మహమ్మారి వెంటాడుతది : భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వానలు పడ్తయ్..  పంటలు బాగా పండుతయ్ కానీ, మహమ్మారి వెంటాడుతది :   భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత
  • అగ్నిప్రమాదాలు జరుగుతయ్.. జాగ్రత్తగా ఉండాలె  
  • రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

పద్మారావునగర్, వెలుగు:  ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని.. కానీ, రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అగ్నిప్రమాదాలు కూడా సంభవిస్తాయని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగ్గా.. సోమవారం ప్రధాన ఘట్టమైన 'రంగం' కార్యక్రమాన్ని  నిర్వహించారు.

గర్భగుడిలో అమ్మవారికి ఎదురుగా పచ్చికుండపై నిలబడి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. మహంకాళి బోనాల ఉత్సవంతో సంతృప్తి చెందావా తల్లీ? అని ప్రశ్నించగా ‘‘ప్రజలంతా డప్పుచప్పుళ్లతో ఆనందోత్సాహాల నడుమ నాకు బోనాలు సమర్పించారు. వచ్చిన ప్రతి బోనాన్ని నేను సంతోషంగా అందుకున్నా. ఈసారి చాలా సంతోషంగా పూజలు చేశారు. మీ అందరినీ సంతోషంగా, సమానంగా చూస్తా. మీ అరికాలిలో ముల్లు గుచ్చుకుంటే నాలుకతో తీస్తా. కాలం తీరితే ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారు. 

నేను అడ్డురాను’ అని  సమాధానమిచ్చారు. ‘బాలబాలికలను మీరు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు.. కానీ, నేను కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నా. ప్రతి ఏటా ఉత్సవానికి ఏదో ఒక ఆటంకం కల్పిస్తున్నారు.. నన్ను ఎవరూ లెక్కచేయడం లేదు’ అని ఆగ్రహించారు. ‘రాశులకొద్దీ రప్పించుకుంటున్నారు. గోరంతైనా నాకు దక్కడం లేదు. సక్రమంగా పూజలు చేయడం లేదు.. మీరు నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు.. మీరు అన్నీ ఆరగిస్తారు.. నాకు మాత్రం ఇవ్వడం లేదు.. ప్రతిసారిలాగే ఈ సారి కూడ పొరపాట్లు చేశారు.. అయినా, నేను అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నా’ అని అన్నారు.

‘జరుగుతున్న పరిణామాలకు నా పాత్ర ఉంటుంది.. నా రూపాన్ని పెట్టడానికి కూడా అడ్డుపడుతున్నారు.. నాకు ఎవరైతే ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తారో వాళ్లు రక్తం కక్కుకుంటారు. నాకు పూజలు చేసి రక్తం చూపించండి.. నాకు తప్పనిసరిగా అన్ని విధివిధానాల ప్రకారం పూజలు జరిపించండి. ఏటికొక్కసారి నాకు ఇలా పూజలు జరిపించాలి. నాకు ఐదు వారాల పాటు పూజలు చేసి పప్పు, బెల్లంతో సాక పోసి ఆనందపరచండి.. నన్ను కొలిచే నా అక్కచెల్లెళ్లందరికీ అండగా ఉంటా’ అని అన్నారు. అనంతరం అమ్మవారి 
ప్రతిమను అంబారిపై ఊరేగించారు.

అమ్మవారికి జరగాల్సిన అన్ని పూజలు చేస్తం: మంత్రి పొన్నం 

లష్కర్​బోనాల జాతర బాగా జరిగిందని, ప్రతి ఏడాది కంటే ఈసారి భక్తులు అధికంగా వచ్చారని హైదరాబాద్ జిల్లా ఇన్​చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రంగం తర్వాత ఆలయ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. భవిష్యవాణిలో అమ్మవారు కోరినట్టుగా ప్రతీ అంశాన్ని పరిగణనలోనికి తీసుకొని ప్రభుత్వం తరఫున అన్నీ చేస్తామన్నారు. బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నిలిచిపోయిన జంతు బలి అంశాన్ని పరిశీలిస్తామన్నారు. 

దేవాదాయ శాఖ తరఫున శాస్త్రీయంగా, సంప్రదాయంగా జరగాల్సిన అన్ని రకాల పూజలు తప్పకుండా నిర్వహిస్తామన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు చేపడుతుందని వెల్లడించారు. రంగం కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్​యాదవ్, పీసీసీ వైస్​ ప్రెసిడెంట్ కోట నీలిమ, కలెక్టర్​ హరిచందన తదితరులు పాల్గొన్నారు.