
హైదరాబాద్ సిటీ, వెలుగు: నేడు పట్నం మొత్తం బోనమెత్తనుంది. సిటీలోని గల్లీగల్లీ అమ్మవారి సేవలో పులకించనుంది. గత నెల 26న గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఉత్సవాలు గడిచిన మూడు వారాలుగా ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం నగరవ్యాప్తంగా బోనాలు నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయానికి బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
తెల్లవారుజామున అమ్మవారికి బలిహరణం, అభిషేకం అనంతరం భక్తులు బోనాలు సమర్పించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని చూడముచ్చటగా అలంకరించారు. సింహవాహిని అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టువస్ర్తాలు, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ బోనం సమర్పించనున్నారు.
దుమ్మురేపనున్న ఫలహారం బండ్ల ఊరేగింపులు
పాతబస్తీలోని హరిబౌలి అక్కన్న మాదన్న, దర్బార్ మైసమ్మ, కోవబేటా బంగారు మైసమ్మ, బేటా చందూలాల్ మాతేశ్వరి ముత్యాలమ్మ, గౌలిపురా మహంకాళి మాతేశ్వరి, కోటమైసమ్మ, సుల్తాన్ షాహీ జగదాంబ, ఉప్పుగూడ మహంకాళి, చార్మినార్ భాగ్యలక్ష్మి, హరిజన బస్తీ నల్లపోచమ్మ, చాంద్రాయణగుట్ట బంగారు మైసమ్మ, ట్యాంక్‌బండ్ కట్టమైసమ్మ, అంబర్‌పేట మహంకాళితోపాటు తదితర ప్రధాన ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
పలు ఆలయాల్లో అమ్మవార్లకు మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సోమవారం రంగం, బలిగంప కార్యక్రమాలతోపాటు ఉమ్మడి దేవాలయాల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో తొట్టెల, ఫలహారం బండ్ల ఊరేగింపు ఘనంగా కొనసాగనుంది. ఈ నెల 24న గోల్కొండ కోటలో జగదాంబిక మహంకాళి అమ్మవారికి 9వ పూజ అనంతరం ఆషాడమాస బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి.
24 గంటలు వైన్స్‌లు బంద్
హైదరాబాద్‌సిటీ/ ఎల్బీనగర్, వెలుగు: బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ఆయా ప్రాంతాల్లో వైన్‌షాపులు, కల్లు దుకాణాలను మూసి ఉంచాలని సీపీలు సీవీ ఆనంద్, అవినాశ్మహంతి, సుధీర్‌బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో
ఉండనున్నాయి.