
- క్లాసులు మొదలై మూడు నెలలు
- అన్ని కాలేజీలు, స్కూళ్లకు ప్రారంభంలోనే టెక్ట్స్ బుక్స్
- ఇబ్బందిపడుతున్న విద్యార్థులు
- పాత వాటితో అడ్జస్ట్ చేస్తున్న లెక్చరర్లు
- వెంటనే బుక్స్ అందేలా చూడాలని పేరెంట్స్ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచినా ఎస్సీ రెసిడెన్షియల్ కాలేజీలకు ఇంటర్ పుస్తకాలు చేరలేదు. ఇతర ప్రభుత్వ కాలేజీలు, 10 వరకు గురుకులాల పాఠశాలలకు అకాడమిక్ ఇయర్ ప్రారంభంలోనే టెక్స్ట్ బుక్స్ చేరాయి. కానీ, ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ చదివే విద్యార్థులకు మాత్రమే ఇంకా పుస్తకాలు అందలేదు. దీంతో స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు వస్తాయని అడిగితే లెక్చరర్లు సమాధానం చెప్పలేకపోతున్నారు. అరకొరగా ఉన్న పాత బుక్స్ తెప్పించి నలుగురైదుగురికి కలిపి ఒక్కో సెట్ ఇచ్చారు. విషయం తెలిసిన పేరెంట్స్ .. ఈ విద్యా సంవత్సరంలో టెక్స్ట్ బుక్స్ అందిస్తారా? ఇవ్వరా? అని ఆఫీసర్లను నిలదీస్తున్నారు.
238 కాలేజీలు.. 50 వేల మందికి పైగా విద్యార్థులు
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినవే ఎస్సీ గురుకులాలు. ప్రైవేటు కాలేజీల్లో లక్షలకు లక్షలు ఫీజులు కట్టలేని వాళ్లంతా సర్కారు ఏర్పాటు చేసిన ఈ రెసిడెన్షియల్ కాలేజీల్లో చేరడం ఆనవాయితీగా వస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా 75 బాయ్స్, 122 గర్ల్స్ ఇంటర్మీడియెట్ కాలేజీలతో పాటు సీఓఈ పద్ధతిలో 17 బాయ్స్, 20 గర్ల్స్ రెసిడెన్షియల్ కాలేజీలు ఉన్నాయి. వీటితో పాటు ఇంటర్మీడియెట్ కోర్సులతో కూడిన 37 వృత్తి విద్యా కాలేజీలునడుస్తున్నాయి.
మొత్తం 238 ఎస్సీ గురుకుల కాలేజీల్లో 50 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. మరోవైపు కొద్ది రోజుల్లోనే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు వెంటనే పాఠ్యపుస్తకాలు అందేలా చూడాలని అధికారులకు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలుగు అకాడమీలో లేట్ అవుతోందట..
నిజానికి కాలేజీలు ప్రారంభమైన వెంటనే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అనుగుణంగా గత వేసవిలోనే ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా గురుకులాల సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేసింది.
కాలేజీలు ప్రారంభమైన కొద్ది రోజులకే టీఎస్ఆర్ఎస్, బీసీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజీలతో పాటు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు తమ దగ్గర ఉన్న సీట్ల సంఖ్యకు 10 శాతం అదనంగా పాఠ్యపుస్తకాలు కావాలంటూ ఆయా శాఖల ఉన్నతాధికారులకు రిపోర్టులు అందజేశాయి. కాలేజీ ప్రిన్సిపాల్స్ నుంచి వచ్చిన విజ్ఞప్తుల ప్రకారం ఆయా గురుకులాల సెక్రటరీలు ఒకేసారి బుక్స్ ప్రింటింగ్ కు ఆర్డర్లు ఇచ్చారు. దీంతో జూన్‌లోనే అన్ని కాలేజీలకు బుక్స్, నోట్ బుక్స్ అందాయి.
కానీ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ రెసిడెన్షియల్ కాలేజీలకు మాత్రం పాఠ్యపుస్తకాలు అందలేదు. దీనిపై ఆరా తీయగా.. ఆ శాఖ సెక్రటరీ ఆఫీసులోనే ఆలస్యం జరిగినట్లు తెలిసింది. పైగా తాము పాఠ్య పుస్తకాల ముద్రణ కోసం తెలుగు అకాడమీకి ఇండెంట్పంపించామని, అక్కడే లేట్అవుతోందని ఆఫీసర్లు చెప్పారు.
త్వరలోనే పాఠ్యపుస్తకాలు అందజేస్తాం
ఎస్సీ రెసిడెన్షియల్జూనియర్ కాలేజీల్లో పాఠ్యపుస్తకాల ముద్రణ కోసం తెలుగు అకాడమీకి ఇండెంట్పంపించినం. అక్కడ లేట్ అవుతోంది. అందుకే కొత్త బుక్స్ కాలేజీలకు ఇంకా రాలేదు. ఈలోగా పూర్వ విద్యార్థుల నుంచి సేకరించిన పుస్తకాలను విద్యార్థులకు అందించి, విద్యాబోధన జరుపుతున్నాం. త్వరలోనే రాష్ట్రంలోని సొసైటీ పరిధిలోని అన్ని ఇంటర్కాలేజీలకు కొత్త టెక్స్ట్‌బుక్స్ అందించేలా
ఏర్పాట్లు చేస్తం.
-సక్రు నాయక్, జాయింట్ సెక్రటరీ (అకాడమిక్) ఎస్సీ గురుకుల సొసైటీ -