
బీజేపీలో బూర నర్సయ్య గౌడ్ చేరికకు ముహూర్తం ఖరారు అయ్యింది. బుధవారం బీజేపీ జాతీయ నేతల సమక్షంలో కమలం కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీకి బయల్దేరారు. సాయంత్రం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ తో భేటీ కానున్నారు. మునుగోడు టికెట్ బీసీలకు పరిశీలించండి అని తాను అడగడాన్ని కూడా వాళ్లు భరించలేకపోయారు. బీసీలకు టికెట్ అడిగితే తప్పేంటి ? తాను బీసీలకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసిన తర్వాత.. మునుగోడు బై పోల్ కు సంబంధించి టీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా చాలా మీటింగ్ లు జరిగాయని బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. వాటికి నన్ను పిలవలేదు. కనీసం నాకు సమాచారం ఇవ్వలేదు. ఇస్తే తీసుకోవాలే కానీ.. బయట అడగడం ఏమిటి ? ఇది ఆగాలంటే బూర నర్సయ్య గౌడ్ ను కట్ చేయాలని టీఆర్ఎస్ మీటింగ్ లలో చర్చించుకున్నారట.’’
ప్రతి నిర్ణయం వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. సుదీర్ఘ కాలంగా జరిగిన సంఘటనలకు ఒక క్లైమాక్స్ ఉంటుంది. అదే ఇది. తెలంగాణ సాధన లక్ష్యం కోసం ఆనాడు కేసీఆర్ పాత రాజకీయ బంధాలను తెంచుకొని, టీడీపీని వదులుకొని కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు.. తాను కూడా ఇప్పుడు తెలంగాణలోని అట్టడుగు వర్గాల ప్రయోజనాల కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. బీజేపీలో చేరాలని డిసైడ్ అయ్యాను. టీఆర్ఎస్ కు రాజీనామా చేశానని చెప్పారు.
టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం కేసీఆర్ కు బూర నర్సయ్యగౌడ్ లేఖ పంపారు. 2009 నుంచి తెలంగాణ ఉద్యమం, పార్టీ ప్రస్థానంపై లేఖలో ప్రస్తవించారు .2019లో ఎంపీగా ఓడిన తర్వాత చాలా అవమానాలు ఎదుర్కొంటున్నానని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో బూర నర్సయ్య గౌడ్ క్రియాశీలక పాత్ర పోషించారు. 2013 సంవత్సరంలో టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన.. 2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.