సరిహద్దు జిల్లాల్లో అలర్ట్​గా ఉండాలె.. చత్తీస్​గఢ్ విషయంలో మరింత జాగ్రత్త

సరిహద్దు జిల్లాల్లో అలర్ట్​గా ఉండాలె.. చత్తీస్​గఢ్ విషయంలో మరింత జాగ్రత్త

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలున్న జిల్లాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ)ని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించింది. ముఖ్యంగా చత్తీస్ గఢ్ తో సరిహద్దు ఉన్న జిల్లాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పింది. ఇందుకోసం తగిన స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా వ్యవహరించాలని సూచించింది.

ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు చత్తీస్ గఢ్ కు సరిహద్దులో ఉన్నాయని, అక్కడ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొంది. అందులో భాగంగానే అదనంగా గ్రేహౌండ్స్, కేంద్ర బలగాలను మోహరించాలని, ఇతర రాష్ట్రాలతోనూ సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర సీఈఓకు ఈసీ స్పష్టంచేసింది. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న చెక్ పోస్టులను డబుల్ చేయాలని తెలిపింది. 

ఆయా ప్రాంతాల్లో డబుల్ చెక్ పోస్టులు 

మద్యం, నగదు రవాణాను అడ్డుకోవడంతో పాటు బోగస్ ఓటింగ్​ను కూడా నిరోధించేలా ఈ చెక్ పోస్టులు పనిచేయనున్నాయి. చత్తీస్​గఢ్​​లోని బీజా పూర్​ జిల్లాకు సరిహద్దుగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చీరాల పోలీస్ స్టేషన్ చెక్ పోస్ట్, సుకుమా జిల్లాలోకి ప్రవేశించే దగ్గర దుమ్ముగూడెం చెక్ పోస్ట్.. అదేవిధంగా భద్రాచలం నుంచి కుంట వెళ్లే మార్గంలో మరో చెక్​ పోస్ట్ ఏర్పాటు చేశారు.

ఈ ప్రాంతాల్లో ఇప్పుడు డబుల్ చెక్​ పోస్టులు నడవనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు అటు చత్తీస్​గఢ్ తో పాటు ఇటు మహారాష్ట్రతోనూ సరిహద్దు ఉంది. పేరూరు పోలీస్ స్టేషన్, తార్లగూడెం, కాళేశ్వరం దగ్గర చెక్ పోస్ట్​ఏర్పాటు చేశారు. సీఆర్ పీఎఫ్​ బలగాలను కూడా రంగంలోకి దింపుతున్నారు. ఆంధ్రప్రదేశ్​ బార్డర్ విషయంలోనూ తగిన జాగ్రత్తలు అవసరమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నగదు రవాణా, డూప్లికేట్ ఓటర్ల విషయంలో అలర్డ్​గా ఉండాలని సూచించింది. కాగా, ఎలక్షన్ బందోబస్తు కోసం మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఒడిశా, కర్నాటక నుంచి పోలీసులను పంపాలని సీఈఓ కోరినట్లు తెలిసింది.