పుతిన్ మ‌హిళ అయి ఉంటే ఉక్రెయిన్‌పై యుద్ధం ఉండేది కాదు

పుతిన్ మ‌హిళ అయి ఉంటే ఉక్రెయిన్‌పై యుద్ధం ఉండేది కాదు

బెర్లిన్‌ : ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో బ్రిట‌న్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక‌వేళ మ‌హిళ అయి ఉంటే, అప్పుడు ఉక్రెయిన్‌పై యుద్ధం చేసేవాడు కాదని బోరిస్ జాన్సన్ అన్నారు. జ‌ర్మనీ మీడియా సంస్థ జేడీఎఫ్‌తో మాట్లాడుతూ బోరిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఒక‌వేళ పుతిన్ మహిళ అయి ఉంటే, నిజానికి కాదు అనుకోండి, కానీ ఒక‌వేళ అయి ఉంటే, బ‌హుశా అత‌ను ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లి ఉండేవాడు కాదు’ అని అన్నారు. 

ఉక్రెయిన్‌పై ఆక్రమ‌ణ‌కు వెళ్లడం అంటే అది విష‌పూరిత‌మైన మ‌గ‌బుద్ధి అని బోరిస్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బాలికలకు మెరుగైన విద్య అందించాలని పిలుపునిచ్చిన బోరిస్ జాన్సన్.. చాలామంది మహిళలు అధికారం చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంలోనే పుతిన్ తీరును ఎండగట్టారు.  

నిజానికి ఉక్రెయిన్ పై యుద్ధం ఆగాల‌ని ప్రజ‌లు కోరుకుంటున్నార‌ని, కానీ, ప్రస్తుత ప‌రిస్థితుల్లో పుతిన్ ఎటువంటి శాంతి హ‌స్తాన్ని అందించ‌డం లేద‌ని బోరిస్ కామెంట్స్ చేశారు. ఉక్రెయిన్‌కు మ‌ద్దతు ఇచ్చే అంశంలో ప‌శ్చిమ దేశాలు వ్యూహాత్మకంగా కీల‌క‌మైన స్థానంలో ఉండాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.