
లండన్ : బ్రిటన్‌లో బోరిస్ జాన్సన్ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రధాని జాన్సన్‌పై విశ్వాసం కోల్పోయామని చెబుతూ మంగళవారం (జులై 5న) ఇద్దరు సీనియర్ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు మంత్రులు కూడా రాజీనామా చేశారు. శిశు, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విల్ క్విన్ ట్విటర్ వేదికగా తన రాజీనామాను ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పదవి నుంచి వైదొలగడం కంటే తనకు మరో అవకాశం లేదని పేర్కొన్నారు. ఈ ప్రకటన వెలువడిన కాసేపటికే రవాణా శాఖ సహాయ మంత్రి లారా ట్రాట్ కూడా తన పదవి నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. బోరిస్ ప్రభుత్వం మీద తనకు విశ్వాసం పోయిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లారా తెలిపారు. భారత మూలాలున్న ఆర్థిక మంత్రి రిషి సునక్ (42)తో పాటు పాక్ మూలాలున్న ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ ఇప్పటికే రాజీనామా చేశారు.
Two more UK ministers John Glen and Victoria Atkins resign from PM Boris Johnson's govt. Yesterday Finance Minister Rishi Sunak and Health Secretary Sajid Javid had quit their posts
— ANI (@ANI) July 6, 2022
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవల అనేక వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో అధికార నివాసంలో పార్టీ చేసుకున్నందుకు ఆయనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. పార్టీలో కూడా బోరిస్ జాన్సన్ కు మద్దతు నానాటికీ తగ్గిపోతూ వస్తోంది. ఇటీవలి బలపరీక్షలో జాన్సన్ బొటాబొటిగా బయటపడ్డారు. ఆ తర్వాత ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్ క్రిస్ పించర్ వివాదం కూడా బోరిస్ మెడకు చుట్టుకుంది. 2019లో ప్రధాని జాన్సన్... క్రిస్ పించర్‌ను ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్‌గా నియమించారు. అప్పటికే అతని నడవడికకు సంబంధించి పలు ఆరోపణలున్నాయి. ఆ విషయాన్ని ప్రభుత్వాధికారులు చెప్పినా జాన్సన్ పట్టించుకోకుండా క్రిస్ పించర్‌ను కీలకమైన పదవిలో కూర్చోబెట్టారు. ఇటీవల ఒక క్లబ్‌లో తాగిన మత్తులో క్రిస్ పించర్ ఇద్దరు పురుషుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. అయితే అతను ఇలాంటి వాడని తనకు తెలియదని ప్రధాని బోరిస్ తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ, పించర్ గురించి తాము ముందే నివేదించామని మాజీ అధికారి ఒకరు చెప్పడంతో బోరిస్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. దీంతో బోరిస్‌పై తమకు విశ్వాసం లేదంటూ రిషి సునాక్, జావిద్ నిన్న మంత్రి పదవుల నుంచి తప్పుకొన్నారు. ప్రధాని కూడా వైదొలగాలని డిమాండ్ చేశారు. తాజాగా మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడంతో బోరిస్ జాన్సన్ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది.