కాగజ్‌నగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం వల్లగొండ గ్రామపంచాయతీ పరిధిలోని సీతానగర్ శివారులో పత్తి చేనులో పసికందును గుడ్డలో కట్టి పడేసిన ఘటన కలకలం రేపింది. స్థానికులు ఉదయం గ్రామ సమీపంలోని పత్తి చేను వైపు వెళ్లగా శిశువు ఏడుపు వినిపించింది.
గుడ్డలో చుట్టి పడేసిన ఆడ శిశువు ఉండడంతో వెంటనే ఈస్ గాం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై కల్యాణ్ సిబ్బందితో కలిసి అక్కడకి చేరుకొని శిశువును కాగజ్ నగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి వైద్యం అందించారు. రూరల్ సీఐ కుమారస్వామితో కలిసి బాల సంరక్షణ కేంద్రానికి సమాచారం ఇచ్చారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి బూర్ల మహేశ్ సిబ్బందితో చేరుకొని ఒక రోజు వయసు ఉన్న శిశువును బాల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు.
