నా తండ్రి అవశేషాలు తీస్కరండి: ప్రధాని మోడీకి బోస్ కుమార్తె విజ్ఞప్తి

నా తండ్రి అవశేషాలు తీస్కరండి: ప్రధాని మోడీకి బోస్ కుమార్తె విజ్ఞప్తి

న్యూఢిల్లీ: తన తండ్రి నేతాజీ సుభాష్‌‌ చంద్రబోస్‌‌కు సంబంధించిన అవశేషాలను జపాన్‌‌ నుంచి తీసుకురావాలని ఆయన కుమార్తె అనితా బోస్‌‌ ఫాఫ్‌‌ ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. నేతాజీ ఉపయోగించిన వస్తువులు, డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలతో పాటు ఆయన అవశేషాలు జపాన్‌‌లోని రెంకోజీ ఆలయంలో ఉన్నాయని తెలిపారు. 

ప్రధాని మోడీతో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం వస్తే.. తన తండ్రి అవశేషాలను తిరిగి తీసుకురావాలని కోరుకుంటానని శుక్రవారం ఎన్డీటీవీతో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పుడు తనకు 82 ఏండ్లు అని, తన తండ్రి అవశేషాలను అప్పగించి, ఈ సమస్యకు ముగింపు పలకాలని కోరారు. రెంకోజీ ఆలయానికి వెళ్లి, తన తండ్రి అవశేషాలు ఇవ్వాలని అడగడం తన వ్యక్తిగత విషయం కాదని, ఇది దేశానికి సంబంధించిందని పేర్కొన్నారు.