కారులో బాలుడి మృతి.. పోలీసులకు పలు అనుమానాలు

కారులో బాలుడి మృతి.. పోలీసులకు పలు అనుమానాలు

విశాఖపట్నంలో విషాదం నెలకొంది.  ఎనిమిదేళ్ల  బాలుడు కారులో ఉండిపోయి  ఊపిరాడక  మృతి చెందాడు.  నగరంలోని మల్కాపురం పీఎస్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. సిందియా లోని  నేవీ ఆమ్ జారీ పార్క్  వద్ద  ఒక  లెఫ్టినెంట్  కమాండర్  ఇంట్లో వినోద్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం  తన కొడుకు  ప్రేమ్  కుమార్  (8)తో పనికి వచ్చిన వినోద్..  యజమాని కార్ క్లీన్ చేశాడు. ఆ సమయంలో బాలుడు  ఆడుకుంటూ కార్ లో దూరాడు. సడన్ గా కార్  లాక్ పడిపోవడంతో బాలుడు అందులోనే ఇరుక్కుపోయాడు. ఇదంతా గమనించని బాలుడి తండ్రి తన పని ముగించుకొని వెళ్ళిపోయాడు. కాసేపటికే ఆ బాలుడు అందులోనే ఊపిరాడక చనిపోయాడు. బాలుడు చనిపోయిన విషయాన్ని  సోమవారం సాయంత్రం ఇంటి  యజమాని  గుర్తించి అతని తండ్రికి  సమాచారం ఇచ్చారని  పోలీసులు చెబుతున్నారు.

అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  కారులోకి  బాలుడు ఎలా  వెళ్లాడన్న విషయం పోలీసులకు  అంతుపట్టడం  లేదు. బాలుడు  కారులోకి  వెళ్లినా  తండ్రి  చూడకపోవటంపై వారికి అనుమానం కలుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి బాలుడు కనపడకపోయినా ఎక్కడా వెతికే ప్రయత్నం కూడా చేయలేదని వారు అంటున్నారు. నేవీ నిషేధిత  ప్రాంతం  కావడంతో బాలుడి మృతిపై  పూర్తి  సమాచారం  కోసం  పోలీసులు  ప్రయత్నాలు చేస్తున్నారు.