- తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియాకు తరలింపు
ఎల్బీనగర్, వెలుగు:హైటెన్షన్ విద్యుత్ వైర్లకు చిక్కుకున్న పతంగిని స్టీల్ పైపుతో తీయడానికి ప్రయత్నించి ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం రాచలూరుకు చెందిన గణేశ్ (15) మీర్‌పేట్ పరిధిలోని ప్రశాంతి నగర్లో ఉంటున్న తన మేనత్త ఇంటికి ఆధార్ కార్డు అప్‌డేట్ కోసం వచ్చాడు. ఇంటి సమీపంలోని హైటెన్షన్ వైర్లకు పతంగి చిక్కుకోవడంతో స్టీల్ పైపు సాయంతో తీయడానికి ప్రయత్నించాడు.
ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో బాధితుడిని వెంటనే ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరోవైపు కరెంట్‌షాక్ వల్ల ఇంట్లో ఫ్యాన్లు ఊడిపడి పలు గృహోపకరణాలు షార్ట్ సర్క్యూట్‌కు గురై భారీ ఆస్తి నష్టం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, హైడ్రా సిబ్బంది కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
