ప్రియురాలి భర్తను చంపిన ప్రియుడు

ప్రియురాలి భర్తను చంపిన ప్రియుడు
  • అక్రమ సంబంధమే కారణం!

స్టేషన్ ఘన్​పూర్, వెలుగు: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి భర్తను ప్రియుడు, అతడి బావమర్ది కలిసి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన స్టేషన్ ఘన్​పూర్ మండలం నమిలిగొండలో జరిగింది. ఏసీపీ గైక్వాడ్ వైభవ్ వివరాల ప్రకారం.. ఘట్ కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో ఆకుల మహేశ్(26), అతడి భార్య అశ్విని(25) నివాసం ఉంటున్నారు. మహేశ్​ ఓ పెట్రోల్ బంక్​లో పనిచేస్తుండగా.. అశ్విని పూలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఈక్రమంలో అశ్విని, స్టేషన్ ఘన్​పూర్ మండలం మీదికొండకు చెందిన పసుల కుమార్(31)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పసుల కుమార్ ఘట్​కేసర్ లో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వీరిద్దరికి మహేశ్​అడ్డుగా ఉన్నాడనే కారణంతో అతన్ని చంపాలని ప్లాన్ వేసుకున్నారు. పసుల కుమార్, అతని బావమర్ది పాలెపు క్రిష్ణ(28) కలిసి ఈ నెల 5న మహేశ్​ను ఓ ప్రైవేట్​కారులో క్రిష్ణ స్వస్థలం అయిన స్టేషన్ ఘన్​పూర్ మండలం నమిలిగొండకు తీసుకెళ్లారు. అక్కడ మహేశ్​కు ఫుల్లుగా మద్యం తాగించారు. మహేశ్ తలపై ఇరువురు బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. మృతదేహాన్ని సంచిలో పెట్టి, ఓ బావిలో పడేశారు. ఈ నెల 8న భార్య అశ్విని తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. మహేశ్​ కాల్​డేటా ఆధారంగా పసుల కుమార్​ను పట్టుకున్నారు. అతన్ని విచారించగా.. తానే నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. కుమార్​తో పాటు అతని బావమర్ది క్రిష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ఇచ్చిన సమాచారం మేరకు బావిలో డెడ్​బాడీని వెలికి తీశారు. కార్యక్రమంలో డీసీపీ శ్రీనివాస్​రెడ్డి, జనగామ ఏసీపీ వినోద్​కుమార్​, సీఐ ఎడవెల్లి శ్రీనివాస్​రెడ్డి, ఎస్సై రమేశ్​నాయక్ ఉన్నారు.