పని ఇచ్చిన సంస్థకే కన్నం.. బీఎస్ఎన్ఎల్ అండర్ గ్రౌండ్ కేబుళ్ల చోరీ

పని ఇచ్చిన సంస్థకే కన్నం..  బీఎస్ఎన్ఎల్ అండర్ గ్రౌండ్ కేబుళ్ల చోరీ

సికింద్రాబాద్, వెలుగు: బీఎస్ఎన్ఎల్ అండర్ గ్రౌండ్ కేబుల్ వైర్లను దొంగిలిస్తున్న ముఠాలోని 14 మందిని బోయిన్ పల్లి పోలీసులు అరెస్టు చేశారు. వాటిని కొంటున్న మరో ఇద్దరు రిసీవర్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 120 కిలోల కాపర్ వైర్లు, ఆటో, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ నార్త్ జోన్ ఆఫీస్​లో డీసీపీ రష్మీ పెరుమాళ్, అడిషనల్ డీసీపీ పగడాల అశోక్ కలిసి ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. 

కూలీలుగా నగరానికి వచ్చి.. 

మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు చెందిన వళ్లపు వినోద్ (27) , బండారి వీరన్న (30), వేముల శ్రీను (22), గుంజ రాములు (23), వేముల రాజేశ్ (19), గోగుల వినోద్ (35), వేముల ఏసు (26), వేము నాగరాజు (26), వల్లపు వినయ్ (19), వేముల శ్రీను (35), వేముల సైదులు (30), గుంజ కృష్ణ (42), బండారి ప్రవీణ్ (23), ఒంటి పులి రాంబాబు (25)...  నగరానికి వచ్చి హయత్ నగర్ లోని బంజారా కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరంతా బీఎస్ఎన్ఎల్ అండర్ గ్రౌండ్ కమ్యూనికేషన్ కేబుల్ వైర్లను అమర్చేందుకు అవసరమైన రోడ్ కటింగ్, డిగ్గింగ్ పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. 

కూలీగా వచ్చే సంపాదన సరిపోక పని ఇచ్చిన సంస్థకే కన్నం వేయాలని ప్లాన్ వేశారు. బీఎస్ఎన్ఎల్ వర్కర్లలా సంస్థకు చెందిన రిఫ్లెక్ట్​ జాకెట్లు ధరించి రాత్రి సమయాల్లో ఆటోలో తిరుగుతూ యథేచ్చగా కేబుల్ వైర్లను కట్ చేసి ఎత్తుకెళ్తున్నారు. ఆ తర్వాత కేబుల్ నుంచి కాపర్​వైర్లు వేరు చేసి హయత్​నగర్ ముదిరాజ్ కాలనీలో స్క్రాప్ బిజినెస్ చేస్తున్న కేతావత్ రమేశ్ నాయక్ (33), పెద్ద అంబర్​ పేట్​కు చెందిన కొల్లియాల సత్యనారాయణ (58) విక్రయించి ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నారు.

అధికారుల ఫిర్యాదుతో బయటపడిన బాగోతం

ఇలా వీరు కుషాయిగూడ, బోయిన్​పల్లి, కార్ఖాన, అబ్దుల్లాపూర్​ పేట్​ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్​కేబుళ్లు దొంగిలించారు. ఈ నెల 13న బోయిన్​పల్లి ప్రాంతంలో సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో కేబుల్ వైరు చోరీకి గురైనట్లు గుర్తించిన బీఎస్ఎన్ఎల్ అధికారులు.. స్థానిక పోలీసులకు  ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి, తాడ్ బండ్ ఎక్స్ రోడ్ వద్ద ఆటో, రెండు బైక్​లపై వెళ్తున్న 14 మంది నిందితులను అరెస్టు చేశారు. 

వీరి నుంచి రూ.10 లక్షల విలువ చేసే120 కేజీల కాపరు వైరుతోపాటు మూడు వాహనాలు, వైర్ కటింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీకి ప్రధాన సూత్రధారి అయిన బండారి రమేశ్, మరో ఇద్దరు సభ్యులు మక్కల వినోద్, రాలొల్లు మహేశ్ పరారీ ఉన్నట్లు డీసీపీ వెల్లడించారు. ఈ సమావేశంలో  బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి,  బోయిన్​పల్లి ఇన్​స్పెక్టర్​ లక్ష్మీనారానాయణ, డీఐ సర్దాన్​ నాయక్​ పాల్గొన్నారు.