బ్రహ్మోస్ విలువ రూ.40 వేల కోట్లు

బ్రహ్మోస్ విలువ రూ.40 వేల కోట్లు
  • 1300 కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్ట్​
  •  ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి

బ్రహ్మోస్​.. భారత అమ్ముల పొదిలో ఉన్న బ్రహ్మాస్త్రం. ధ్వనికన్నా చాలా చాలా స్పీడ్​గా దూసుకెళ్లే ఈ సూపర్​సోనిక్​ క్రూయిజ్​ మిసైల్​ను రష్యాతో కలిసి మన దేశం తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టు మొదలైనప్పుడు దాని విలువ కేవలం ₹1300 కోట్లు. కానీ, ఇప్పటికి అది ₹40 వేల కోట్లకు పెరిగింది. కాన్ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియన్​ ఇండస్ట్రీ నిర్వహించిన మాన్యుఫాక్చరింగ్​ ఇన్నోవేషన్​ కాన్​క్లేవ్​లో బ్రహ్మోస్​ ఏరోస్పేస్​ సీఈవో, ఎండీ సుధీర్​ మిశ్రా ఈ వివరాలు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులాగే చాలా రంగాల్లో రష్యాతో కలిసి భారత్​ మరిన్ని ప్రాజెక్టుల్లో భాగమైతే బాగుండేదన్నారు. ‘‘రష్యా ఆర్థికంగా కుదేలైనప్పుడు ఇండియా బ్రహ్మోస్​ ప్రాజెక్టు కోసం ఒప్పందం చేసుకుంది. అదే టైంలో మరిన్ని ప్రాజెక్టులకు ఒప్పందం చేసుకుంటే ఇండియా లాభపడేది” అని ఆయన అన్నారు. ‘‘₹1300 కోట్లతో బ్రహ్మోస్​ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇప్పుడు దాని విలువ ₹40 వేల కోట్లకు పెరిగింది. దాని వల్ల బాగానే ఆదాయం వచ్చిందని అనుకుంటున్నాం. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వానికి ఇప్పటిదాకా ₹4 వేల కోట్ల వరకు పన్నుల రూపంలో ఆదాయమిచ్చాం” అని చెప్పారు. చాలా దేశాలు బ్రహ్మోస్​ మిసైల్​ను కొనేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పిన ఆయన, ఆ దేశాలు ఏవన్నది మాత్రం చెప్పలేదు. డిజైనింగ్​, ప్రొడక్ట్స్​ ఇంటిగ్రేషన్​ (అసెంబ్లీ) వరకే పరిమితమయ్యామని చెప్పారు. అంతేకాకుండా మౌలిక వసతుల కల్పన కోసం ఆర్థికంగా సాయం చేశామని, దాని వల్ల చాలా మంది రష్యా సైంటిస్టులు ప్రాజెక్టులో భాగమయ్యారని తెలిపారు. ఇప్పుడు 200 కంపెనీలు తమతో భాగస్వాములుగా ఉన్నాయన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మంది ఉపాధి పొందుతున్నారని చెప్పారు. 1998లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీవో)తో కలిసి రష్యా ఎన్​పీవో మషినోస్త్రోయేనియా బ్రహ్మోస్​ ప్రాజెక్టును చేపట్టింది.