మన ఇప్పసురకు 5 వేల ఏండ్ల చరిత్ర!..బ్రిటిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాళ్ల ఆంక్షలతో వెనుకబడ్డది: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి

మన ఇప్పసురకు 5 వేల ఏండ్ల చరిత్ర!..బ్రిటిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాళ్ల ఆంక్షలతో వెనుకబడ్డది:  జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి
  • పూర్వ వైభవానికి సర్కారు కృషి చేయాలి
  • ఇప్ప పువ్వులో అద్భుతమైన ఔషధ గుణాలు 
  • తయారీ, బ్రాండింగ్​ కోసం 
  • ప్రత్యేక కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలి 
  • శాస్త్రీయంగా మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తే లక్షల కోట్ల 
  • ఆదాయం వస్తుందని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: మన అడవుల్లో సహజ సిద్ధంగా లభించే ఇప్ప పువ్వు సురకు 5 వేల ఏండ్ల ఘనమైన చరిత్ర ఉందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌‌‌‌‌‌‌‌ రెడ్డి చెప్పారు. మెక్సికోలో టకీలా, జపాన్‌‌‌‌లో సాకే మద్యం రకాలు ప్రపంచ స్థాయి బ్రాండ్లుగా ఎలా ఎదిగాయో.. మన ఇప్ప పువ్వు ఉత్పత్తులకు కూడా సరైన మార్కెటింగ్‌‌‌‌ సౌకర్యం కల్పిస్తే లక్షల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో సుమారు 10 లక్షల ఇప్ప చెట్లు ఉన్నాయని, ఒక్కో ఎకరాలో ఇప్ప తోటలు పెంచితే రైతులకు ఏడాదికి రూ.3 లక్షల వరకు ఆదాయం లభిస్తుందని  తెలిపారు.

 మధ్యప్రదేశ్, గోవా, ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ వంటి రాష్ట్రాల్లో ఇప్ప సారాపై ప్రత్యేక పాలసీలు ఉన్నాయని.. మన రాష్ట్రంలోనూ గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం ఇప్ప పువ్వు ఉత్పత్తుల కార్పొరేషన్​ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం శాసనసభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా అనిరుద్ రెడ్డి ఇప్ప పువ్వు ప్రస్తావన తెచ్చారు.

 మద్యం తయారీలో ఇప్ప పువ్వుకున్న ప్రాముఖ్యతను చూసి బ్రిటిష్ వారు భయపడ్డారని, తమ దేశం నుంచి వచ్చే విస్కీ, ఇతర మద్యం బ్రాండ్లు అమ్ముడుపోవాలనే ఉద్దేశంతో 1892లో మౌరా యాక్ట్  తెచ్చి ఇప్ప పువ్వును నిషేధించారని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్ప పువ్వు మద్యం అంటే కేవలం నాటు సారా అనే ముద్ర పడిపోయిందని.. కానీ, నిజానికి అదే అత్యంత నాణ్యమైన దేశీ మద్యం అని ఆయన అభిప్రాయపడ్డారు.

లక్షల  కోట్ల ఆదాయం..

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థానిక ఉత్పత్తుల ద్వారా వస్తున్న ఆదాయాన్ని అనిరుధ్‌‌‌‌ రెడ్డి గణాంకాలతో సహా సభలో వివరించారు. మెక్సికోలో అగవే మొక్కతో చేసే తేకిలా ఏడాదికి రూ.2.34 లక్షల కోట్ల టర్నోవర్‌‌‌‌ సాధిస్తోందని, చైనాలో జొన్నలు, గోధుమలతో చేసే మౌతాయ్‌‌‌‌  రూ.2.26 లక్షల కోట్ల ఆదాయం తెస్తోందని పేర్కొన్నారు. సాట్లాండ్​లో స్కాచ్‌‌‌‌ విస్కీ  ద్వారా రూ.56 వేల కోట్ల వ్యాపారం జరుగుతోందన్నారు. మన ఇప్ప పువ్వును కూడా ఇప్ప తేకిలా లేదంటే ఇప్ప లిక్కర్‌‌‌‌  పేరుతో అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్‌‌‌‌ చేస్తే ఏడాదికి రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉందని ఆయన సూచించారు.

 ఇప్పపువ్వులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని అమెరికాకు చెందిన ‘నేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్’  స్టడీ చేసిందని తెలిపారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డయాబెటిక్, యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయని చెప్పారు. కేవలం మద్యం మాత్రమే కాకుండా ఇప్ప పువ్వుతో కేకులు, ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌లు, జ్యూస్‌‌‌‌లు, చాక్లెట్లు, ఎనర్జీ డ్రింక్స్ కూడా తయారు చేయవచ్చని సూచించారు. కాగా, ఆయన మాట్లాడడం పూర్తయిన తర్వాత మంత్రి సీతక్కతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఆయన్ను కలిసి అభినందించారు.