ఈస్ట్ రూథర్‌ఫోర్డ్: ఫిఫా వరల్డ్ కప్‌లో ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్‌కు తొలి మ్యాచ్‌లోనే గట్టి పోటీ ఎదురైంది. గ్రూప్–సిలో భాగంగా శనివారం రాత్రి జరిగిన ఉత్కంఠభరిత పోరులో మొరాకో జట్టు బ్రెజిల్‌ను 1–1తో నిలువరించింది. స్టార్ ప్లేయర్ వినీషియస్ జూనియర్ (32వ ని) సమయస్ఫూర్తితో గోల్ కొట్టడంతో బ్రెజిల్ ఓటమి నుంచి తప్పించుకుంది. మొరాకో తరఫున ఇస్మాయిల్ సైబారి (21వ ని) గోల్ చేశాడు. మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ సాంబా మ్యాజిక్ ఏమాత్రం కనిపించలేదు.
ఆట ప్రారంభమైన తొలి అరగంటలో మొరాకో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. బ్రెజిల్ డిఫెన్స్‌ను ముప్పుతిప్పలు పెడుతూ ఏకంగా 12సార్లు గోల్ పోస్ట్‌పై దాడి చేసింది. సెకండాఫ్‌లో ఇరుజట్లు గోల్ కోసం తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. బ్రెజిల్ గోల్ కీపర్ అలిస్సన్ ఆఖరి నిమిషాల్లో మొరాకో ప్లేయర్లు చేసిన గోల్ ప్రయత్నాలను చాకచక్యంగా అడ్డుకుని మ్యాచ్‌ను డ్రా వైపు తీసుకెళ్లాడు. గాయం కారణంగా నెయ్‌మార్ ఈ మ్యాచ్‌కు దూరం కావడం జట్టుపై ప్రభావం చూపింది. తాజా డ్రాతో వరల్డ్ కప్ లీగ్ తొలి మ్యాచ్‌ల్లో బ్రెజిల్ తన రికార్డును 21కి (17 విజయాలు, 4 డ్రా) పెంచుకుంది. 1934లో స్పెయిన్ చేతిలో ఓడిన తర్వాత బ్రెజిల్ ఇప్పటి వరకు ప్రారంభ మ్యాచ్‌లో ఓడలేదు.
