కరోనా కల్లోలం.. ప్రపంచంలో రెండో ప్లేస్​కు బ్రెజిల్

కరోనా కల్లోలం.. ప్రపంచంలో రెండో ప్లేస్​కు బ్రెజిల్
  • రోజుకు వెయ్యికి పైగా మరణాలు

బ్రెసీలియా: అమెరికా తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యధిక కొరోనావైరస్ ఇన్ఫెక్షన్లు కలిగిన దేశంగా బ్రెజిల్ ఆవిర్భవించింది. వైరస్ కేసుల్లో ఇప్పటిదాకా రెండో ప్లేస్​లో ఉన్న రష్యాను అధిగమించింది. రోజురోజుకు బ్రెజిల్​లో కరోనా మరణాలు దారుణంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,001 మంది మృత్యువాత పడ్డారు. గడిచిన నాలుగు రోజుల్లో వెయ్యికి పైగా మరణాలు నమోదు కావడం ఇది మూడోసారి అని అక్కడి అధికారులు శనివారం ప్రకటించారు. దేశంలో మొత్తం మృతుల సంఖ్య 21,048కి పెరగగా.. వైరస్ బాధితులు 3,30,890కి చేరుకున్నారని తెలిపారు. మరణాల సంఖ్యలో యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ తర్వాత బ్రెజిల్ ఆరో స్థానంలో ఉంది.

బ్రెజిల్ అధికారిక డేటా కంటే 15 రెట్లు ఎక్కువ మందే చనిపోయి ఉండవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ దేశాన్ని కరోనా హాట్ స్పాట్​గా ప్రకటించింది. లాటిన్ అమెరికా దేశాలలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, అందులో బ్రెజిల్ మరింత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని WHO ఎమర్జెన్సీ డైరెక్టర్ మైక్ ర్యాన్ అన్నారు. యూఎస్ లో 16 లక్షల 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా 96,329 మంది చనిపోయారు. రష్యాలో 3,26,488 కేసులు, 3,249 మరణాలు నమోదయ్యాయి.