ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు
  • బ్రేక్​ దర్శనాల ఏర్పాట్లపై ఎండోమెంట్​ కమిషనర్​పరిశీలన
  • ఇప్పటికే ప్రభుత్వానికి చేరిన ప్రపోజల్స్​
  • బ్రేక్​ దర్శనాలకు రోజుకు రెండు గంటలు కేటాయించే అవకాశం 

యాదగిరిగుట్ట,వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో త్వరలో బ్రేక్ దర్శనాలు ప్రారంభించనున్నారు. వీఐపీలు వచ్చినప్పుడు క్యూలైన్లను నిలిపివేస్తుండడంతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులకు త్వరలో తెరపడనుంది. ఆలయంలో బ్రేక్ దర్శనాలను అందుబాటులోకి తెస్తున్నట్లు గతంలోనే దేవస్థానం ప్రకటించినప్పటికీ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు.

శనివారం నరసింహస్వామిని దర్శించుకోవడానికి యాదగిరిగుట్టకు వచ్చిన ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ తో ఆలయ ఈవో గీతారెడ్డి బ్రేక్ దర్శనాలపై చర్చించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం కమిషనర్ ఆలయ పరిసరాలను పరిశీలించారు. బ్రేక్ దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులు ఉత్తర రాజగోపురం నుంచి ఆలయంలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ కు ఈవో వివరించారు.

బ్రేక్ దర్శనాల కోసం ఏర్పాటు చేసే క్యూలైన్ల మార్గాన్ని కమిషనర్ పరిశీలించారు. బ్రేక్ దర్శనాల కోసం రోజులో రెండు గంటలు కేటాయిస్తున్నట్లు తెలిసింది. ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4గం.నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శనాలకు అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపారని, ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఇంప్లిమెంట్ చేస్తామని ఈవో గీతారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

26న గుట్టలో 'దీపోత్సవం'

ఈ నెల 26న కార్తీకమాసం ప్రారంభం కానుండటంతో అదేరోజు సాయంత్రం కొండపైన ప్రధానాలయ తూర్పు రాజగోపురం వైపున బ్రహ్మోత్సవ మండపంలో దీపోత్సవం చేపట్టనున్నారు. గుట్ట ఆలయానికి వీలైనంత ప్రచారం కల్పించేలా.. ఆలయంలో కొత్త రకమైన పూజలు నిర్వహించాలని ఈవోకు కమిషనర్ సూచించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే 26న సాయంత్రం దీపోత్సవం నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించారు. పై కార్యక్రమాలకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన విడుదల కానుంది. 

భక్తులకు సౌలత్​లు కల్పించండి

శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు సౌలత్​లు కల్పించాలని గుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు దేవాదాయ శాఖ కమిషనర్​అనిల్ కుమార్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. స్వామి దర్శనం కోసం శనివారం యాదగిరిగుట్టకు వచ్చిన కమిషనర్ కు భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

వీకెండ్స్ లో ఆలయానికి వచ్చే భక్తుల రద్దీకి సరిపడా కొండపైన టాయిలెట్స్, వాష్ రూమ్స్, తాగునీటి సదుపాయాలు కల్పించాలని కోరారు. కొండపైకి ఆటోలను అనుమతించకపోవడంతో వాటిపై ఆధారపడి బతుకుతున్న 300 ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో గీతారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కాటం రాజు, కౌన్సిలర్లు అనిల్, నాగరాజు, కాంగ్రెస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు భరత్ గౌడ్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీధర్, కాంగ్రెస్ లీడర్లు  రాజేశ్, హరీశ్ 
​పాల్గొన్నారు.

నరసింహుడి సేవలో ప్రముఖులు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర హైకోర్టు జడ్జి పుల్ల కార్తీక్, ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ వేర్వేరుగా నరసింహుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అద్దాల మండపం వద్ద వారికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ ఈవో గీతారెడ్డి లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. మరోవైపు ఆలయంలో నిత్య పూజలు వైభవంగా జరిగాయి. ఉదయం నుండి రాత్రి వరకు నిత్య కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో మొదలైన పూజలు రాత్రి పవళింపుసేవ, శయనోత్సవ సేవతో ముగిశాయి.

లైసెన్స్ లేకుండా ​అమ్మితే జైలు

సూర్యాపేట వెలుగు: ఫుడ్​ఐటమ్స్​ అమ్మే వ్యాపారులకు లైసెన్స్​ ఉండాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి అన్నారు.  కల్తీ చేసినా, అక్రమంగా అమ్మకాలు సాగించినా ఫైన్​వేయడంతో పాటు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. జాతీయ రహదారిపై ఉన్న దాబాలలో ఫుడ్​ఐటెమ్స్​ కల్తీ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు రావడంతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, మున్సిపల్, సివిల్ సప్లయ్ అధికారులు సంయుక్తంగా దాబాలలో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పలు హోటల్స్ నుంచి శాంపిల్స్ కలెక్ట్​చేసి టెస్ట్​ల కోసం ల్యాబ్ కు పంపించారు. లైసెన్స్ లేని ఐదు హోటల్స్ కు నోటీసులు ఇచ్చారు. ఫుడ్​ ఐటెమ్స్​ నిల్వ ఉంచి, నాణ్యత ప్రమాణాలు పాటించని హోటల్స్ కు రూ.14వేలు ఫైన్​ విధించారు. తనిఖీల్లో ఫుడ్ ఇన్​స్పెక్టర్​కృష్ణ మూర్తి, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, డీటీ నాగలక్ష్మి పాల్గొన్నారు.

‘నల్గొండ గెలుపుబాట’ మాసపత్రిక ఆవిష్కరణ

నల్గొండ అర్బన్​, వెలుగు: బీజేపీ సీనియర్​ నాయకుడు గార్లపాటి జితేంద్ర కుమార్​ ఆధ్వర్యంలో వెలువరించిన 'నల్గొండ గెలుపు బాట మాస పత్రిక'ను శనివారం చౌటప్పల్​లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ఆవిష్కరించారు. అనంతరం జితేంద్ర కుమార్​ మాట్లాడుతూ పా ర్టీ కార్యకర్తలకు సమాచారం అందించడం కోసం ఈ పత్రిక దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎడిటర్​ చింత ముత్యాల్ రావు, భాస్కర్​, భిక్షం పాల్గొన్నారు.

వడ్ల కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి 

యాదాద్రి​, వెలుగు: వానాకాలం సీజన్​ వడ్ల కొనుగోలుకు స్పీడ్​గా ఏర్పాట్లు చేయాలని సివిల్​ సప్లయ్​ కమిషనర్​ వి.అనిల్​కుమార్​ ఆదేశించారు. వడ్ల కొనుగోలుపై యాదాద్రి కలెక్టరేట్​లో కమిషనర్​రివ్యూ చేశారు. ఈ సందర్భంగా పంటల దిగుబడి, కొనుగోలు సెంటర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 
తుక్కాపురంలో ఏర్పాటు చేయబోయే కొనుగోలు సెంటర్​ను పరిశీలించారు. ఆయన వెంట కలెక్టర్​ పమేలా సత్పతి, అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాసరెడ్డి, సివిల్ సప్లయ్​ డీఎం గోపికృష్ణ, డీఎస్వో శ్రీనివాసరెడ్డి ఉన్నారు. 

ప్రతి ఒక్కరూ ఓటేయాలి 

చండూరు (మర్రిగూడ) వెలుగు: లిక్కర్​కు, డబ్బులకు లొంగకుండా ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎలక్షన్ వాచ్ కమిటీ కన్వీనర్ డా.బొమ్మరబోయిన కేశవులు సూచించారు. శనివారం మర్రిగూడ మండలంలో ఎంజేఆర్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ విడుదల చేసిన విజిల్ యాప్ ద్వారా ఎలక్షన్ లో జరిగే అక్రమాలను ఫొటోలు లేదా, వీడియోలు తీసి జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ కు పంపించవచ్చన్నారు. 

బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లించాలి 

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య

కోదాడ,వెలుగు: బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి రీయంబర్స్​మెంట్​చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్​ చేశారు. శనివారం కోదాడ పట్టణంలోని  పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బీసీ విద్యార్థి సింహ గర్జన సభలో ఆయన మాట్లాడుతూ మెరుగైన విద్యా ప్రమాణాలు, హక్కుల సాధన కోసం విద్యార్థులు ప్రభుత్వాలపై ఉద్యమించాలన్నారు.

ప్రస్తుతం విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్ షిప్ రూ.20 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్​మెంట్​బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు అడుగడుగునా అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గాలి శ్రీనివాస్ నాయుడు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్, జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ , ప్రముఖ విద్యావేత్త నాగిరెడ్డి, వివిధ పార్టీల లీడర్లు పాల్గొన్నారు.

టీఆర్ఎస్​, బీజేపీలకు బుద్ధిచెప్పాలి 

ములుగు ఎమ్మెల్యే సీతక్క

చండూరు (నాంపల్లి), వెలుగు: మునుగోడు బై ఎలక్షన్​లో  టీఆర్ఎస్​, బీజేపీలకు బుద్ధి చెప్పాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఓటర్లను కోరారు. శనివారం నాంపల్లి మండలం పీసీసీ ప్రతినిధి చామల కిరణ్​రెడ్డితో కలిసి ఆమె ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ దేశం, రాష్ట్రానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్​ సేవలు చాలా అవసరమని తెలిపారు. రాజగోపాల్​రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసమే మునుగోడు బై ఎలక్షన్​వచ్చిందన్నారు. విప్లవ పునాదులు ఉన్న మునుగోడు ప్రజలు చైతన్యంతో వ్యవహరించి స్రవంతిని గెలిపించాలని అభ్యర్థించారు.

పారిశుద్ధ్య కార్మికుల  సేవలు ప్రశంసనీయం

కోదాడ,వెలుగు: మున్సిపాలిటీలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం కోదాడ  మున్సిపల్ ఆఫీస్​లో పారిశుద్ధ్య సిబ్బందికి బట్టలు, చెప్పులు, నిత్వావసర సరుకులు ఎమ్మెల్యే  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా  సమయంలో కార్మికుల సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. పారిశుద్ధ్యంలో కోదాడ మున్సిపాలిటీని అగ్ర స్థానంలో నిలిపేందుకు కార్మికులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు రమేశ్,  షఫీ, జ్యోతి, మధుసూదన్, టీఆర్ఎస్ లీడర్లు సుధారాణి, చందు నాగేశ్వరరావు, ఉపేందర్ గౌడ్ పాల్గొన్నారు.

మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి

కోదాడ, వెలుగు: దేశం, రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, మహిళ రక్షణ కోసం చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని సీపీఐ అనుబంధ  మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన డిమాండ్ చేశారు. ఇటీవల హైదరాబాద్ డీఏవీ స్కూల్ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన దుండగులను శిక్షించాలని శనివారం కోదాడలో మహిళా సమాఖ్య లీడర్లు నిరసన తెలిపారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు  కోటమ్మ, రంగమ్మ పాల్గొన్నారు.

మునుగోడు ఓటర్లు టీఆర్ఎస్​కే పట్టం కడతరు

ప్రభుత్వ విప్ గొంగిడి సునీత

యాదగిరిగుట్ట, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకేనని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. డబ్బు, మద్యంతో ప్రలోభపెట్టాలని చూసినా మునుగోడు ఓటర్లు టీఆర్ఎస్ కే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ జిల్లా నాయకుడు గట్టు తేజస్వీ నిఖిల్ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు మాజీ వార్డు సభ్యులు, ఎమ్మార్పీఎస్ లీడర్లు 50 మంది శనివారం హైదరాబాద్ ఎల్బీనగర్ లో విప్ సునీత సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ హైకమాండ్​మోసపూరిత మాటలు నమ్మి ఆ పార్టీలో చేరిన కొందరు సీనియర్లు..  అసలు నిజం తొలుసుకుని తిరిగి టీఆర్ఎస్ లోకి వస్తున్నారన్నారు. బీజేపీ పెద్దలు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే ఉండదని చేరికల ఘటనలతో మరోసారి నిరూపితమైందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సీతా రాజు, మాదాపూర్ మాజీ సర్పంచ్ హరినాయక్, మండల యూత్ అధ్యక్షుడు కృష్ణ, పీఏసీఎస్ డైరెక్టర్ చంద్రమౌళి, సీనియర్ నాయకులు నాగరాజు, టీఆర్ఎస్ సోషల్ మీడియా మండల ప్రెసిడెంట్ శ్రీకాంత్ పాల్గొన్నారు. 

టీడీపీ అంటే టీఆర్ఎస్​కు ఉలుకెందుకు

చండూరు, వెలుగు: మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ లీడర్లకు టీడీపీ జెండాలు పడితే ఉలుకెందుకని ఆ  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ ఎద్దేవా చేశారు. శనివారం చండూరులో టీడీపీ ముఖ్య కార్యకర్తల మీటింగ్​లో ఆయన మాట్లాడుతూ తెలంగాణకు చంద్రబాబు మళ్లీ వస్తున్నాడంటూ ‘నమస్తే తెలంగాణ’లో సోషల్ మీడియాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ ప్రచారం చేయడంపై మండిపడ్డారు.

మునుగోడు లో ఆ పార్టీని ఓడించేందుకు గుంటూరు, విజయవాడ నుంచి చంద్ర దండు  వస్తోందని ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు.టీఆర్ఎస్​ను మునుగోడు ప్రజలే మట్టి కర్పిస్తారని విమర్శించారు. మీటింగ్​లో ఆ పార్టీ అధికార ప్రతినిధి అప్పారావు, ఎర్రజెళ్ల లింగయ్య, ఎండీ షరీఫ్, నల్ల సత్యం, అంజయ్య పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ ఓటేయాలి 

చండూరు (మర్రిగూడ) వెలుగు: లిక్కర్​కు, డబ్బులకు లొంగకుండా ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎలక్షన్ వాచ్ కమిటీ కన్వీనర్ డా.బొమ్మరబోయిన కేశవులు సూచించారు. శనివారం మర్రిగూడ మండలంలో ఎంజేఆర్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ విడుదల చేసిన విజిల్ యాప్ ద్వారా ఎలక్షన్ లో జరిగే అక్రమాలను ఫొటోలు లేదా, వీడియోలు తీసి జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ కు పంపించవచ్చన్నారు. 

వడ్ల కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి 

యాదాద్రి​, వెలుగు: వానాకాలం సీజన్​ వడ్ల కొనుగోలుకు స్పీడ్​గా ఏర్పాట్లు చేయాలని సివిల్​ సప్లయ్​ కమిషనర్​ వి.అనిల్​కుమార్​ ఆదేశించారు. వడ్ల కొనుగోలుపై యాదాద్రి కలెక్టరేట్​లో కమిషనర్​రివ్యూ చేశారు. ఈ సందర్భంగా పంటల దిగుబడి, కొనుగోలు సెంటర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 
తుక్కాపురంలో ఏర్పాటు చేయబోయే కొనుగోలు సెంటర్​ను పరిశీలించారు. ఆయన వెంట కలెక్టర్​ పమేలా సత్పతి, అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాసరెడ్డి, సివిల్ సప్లయ్​ డీఎం గోపికృష్ణ, డీఎస్వో శ్రీనివాసరెడ్డి ఉన్నారు. 

ముగ్గురు దొంగల అరెస్ట్​

యాదాద్రి​​, వెలుగు: యాదాద్రి జిల్లా వలిగొండ మండలం టేకులసోమారంలో ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్​ చేశారు. వివరాలిలా ఉన్నాయి..  నల్లగొండ, మహబూబాబాద్​ జిల్లాలకు చెందిన మాదగోని యాకయ్య, బండ రాహుల్​, జోగి దేవేందర్​, కందకట్ల అభిరామ్​ కలిసి సులువుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో దొంగతనాలు స్టార్ట్​చేశారు.

ఈక్రమంలో కారులో వలిగొండకు వచ్చి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న సిరిపురం ప్రమీల కంట్లో కారం చల్లి మెడలో 2 తులాల గోల్డ్​ చైన్​ తెంచుకొని పారిపోయారు. ఆ చైన్​ను తాకట్టు పెట్టి రూ. 69 వేలు లోను తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ పుటేజీలు ఆధారంగా కారును గుర్తించారు. ఆ కారు నల్లగొండకు చెందిన సుక్క భిక్షం పేరుతో ఉండడంతో విచారించగా తాను శ్రీనుకు అమ్మానని తెలిపారు.

పోలీసులు శ్రీనును విచారించగా కందగట్ల అభిరామ్​కు ఇచ్చినట్టుగా చెప్పాడు. శనివారం అదేకారులో నిందితులు వలిగొండ మండలం టేకుల సోమారంలో తిరుగుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొన్నారు. వారి వద్ద నుంచి కారు, రూ. 27,400 నగదు, మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ ప్రభాకర్​ తెలిపారు. మరో నిందితుడు రాహుల్​ పరారీలో ఉన్నాడని ఎస్ఐ చెప్పారు.

ఛాతినొప్పితో కూలీ మృతి

భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని భార్య ఫిర్యాదు

తుంగతుర్తి, వెలుగు:-  కూలీ పనులు చేస్తూ ఓ వ్యక్తి ఛాతి నొప్పితో శుక్రవారం చనిపోయాడు. ఆయన మృతిపై అనుమానాలున్నాయని అతని భార్య శనివారం తుంగతుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన చింతకుంట్ల వెంకన్న (50) శుక్రవారం కూలీ పనిచేస్తుండగా ఛాతిలో నొప్పి రావడంతో స్పాట్​లోనే చనిపోయాడు.

మృతుడి భార్య మూడేండ్లుగా భర్తతో గొడవ పడి పిల్లలతో హైదరాబాద్​లో ఉంటోంది. వెంకన్న స్వగ్రామంలోనే తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. ఈక్రమంలో వెంకన్న ఛాతిపై గాయం ఉందని, ఆయన మృతిపై అనుమానం వ్యక్తంచేస్తూ భార్య సంతోష పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, డెడ్​బాడీని పోస్ట్​మార్టం కోసం తుంగతుర్తి హాస్పిటల్​కు తరలించినట్లు ఎస్సై డానియల్​ తెలిపారు.

సీఎం కేసీఆర్​కు అండగా నిలబడాలి

గొర్రెల కార్పొరేషన్​ చైర్మన్​ బాలరాజు యాదవ్

సంస్థాన్​ నారాయాణ్​పూర్​, వెలుగు : బై ఎలక్షన్​లో మునుగోడు ప్రజలు సీఎం కేసీఆర్​కు అండగా నిలబడాలని రాష్ట్ర గొర్రెల కార్పొరేషన్​ చైర్మన్​ దూదిమెట్ల బాలరాజుయాదవ్​ కోరారు. శనివారం సంస్థాన్​ నారాయాణ్​పూర్​ మండలంలో జరిగిన ఎలక్షన్​సభలో ఆయన మాట్లాడుతూ మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని గుజరాత్​ గులాములకు తాకట్టుపెట్టొదని, బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. నియోజకవర్గంలో ఐదు వేల మందికి పైగా రెండో విడత గొర్రెల యూనిట్లు పంపిణీ చేశామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​రావు, బండా ప్రకాష్​ పాల్గొన్నారు. 

రాజగోపాల్ రెడ్డి ప్రజా సేవకుడు

రాజగోపాల్​రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి 

మునుగోడు, వెలుగు: రాజగోపాల్ రెడ్డి ప్రజా సేవకుడు అని కరోనా టైంలో సొంత డబ్బుతో పేదలకు సాయం చేశాడని కోమటిరెడ్డి సతీమణి లక్ష్మి పేర్కొన్నారు. శనివారం మునుగోడు మండలం ఇప్పర్తి, పలివెల, ఊకోండి, రత్తుపల్లి, సింగారం తదితర గ్రామాలలో ఈటల రాజేందర్​ సతీమణి జమునతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గ్రామాల్లో గడపగడపకు తిరిగి బీజేపీకి ఓటేయాలని కోరారు.

వారు మాట్లాడుతూ మూడున్నరేండ్లుగా రాజగోపాల్ రెడ్డి మునుగోడు అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా  పట్టించుకోలేదని ఆయన 
రాజీనామాతో ప్రభుత్వం దిగివచ్చి సంక్షేమ పథకాలు మొదలుపెట్టిందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారని రాజగోపాల్ రెడ్డికి అండగా నిలిచి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సినీ నటి జీవిత, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్​రెడ్డి పాల్గొన్నారు

మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి 

కోదాడ, వెలుగు: దేశం, రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, మహిళ రక్షణ కోసం చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని సీపీఐ అనుబంధ  మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన డిమాండ్ చేశారు. ఇటీవల హైదరాబాద్ డీఏవీ స్కూల్ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన దుండగులను శిక్షించాలని శనివారం కోదాడలో మహిళా సమాఖ్య లీడర్లు నిరసన తెలిపారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు  కోటమ్మ, రంగమ్మ పాల్గొన్నారు.

కరెంట్​ సిబ్బందిపై దాడి

కోదాడ,వెలుగు: చిలుకూరు మండలం రామాపురం గ్రామంలో బిల్లులు కట్టని ఇండ్లకు కరెంట్​కనెక్షన్​తొలగించారని సిబ్బందిపై ఓ వ్యక్తి దాడి చేశాడు.  శనివారం జరిగిన ఈ ఘటనపై కరెంట్​సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు మండలంలో తరచూ జరుగుతున్నాయి. శుక్రవారం శీతలతండాలోనూ కరెంట్​బిల్లులు తీసేందుకు వెళ్లిన సిబ్బందిపై బిల్లు ఎక్కువ వచ్చిందని ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. 

జ్వరంతో మహిళ మృతి

డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళన 

సూర్యాపేట వెలుగు: సూర్యాపేట జిల్లా కేంద్రంలో జ్వరంతో ఓ మహిళ చనిపోయింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఆమె చనిపోయిందని బంధువులు ఆందోళన చేశారు. బంధువుల వివరాల ప్రకారం.. పెన్ పహాడ్ మండలం సింగిరెడ్డిపాలెంకు చెందిన పాల్వాయి విక్టోరియా(38)  జ్వరంతో బాధపడుతూ అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వద్దకు వెళ్లగా అతడు ఇంజక్షన్​ ఇచ్చాడు. అయినా జ్వరం తగ్గకపోవడంతో సూర్యాపేటలోని ఓ ప్రైవేటు హాస్పిటల్​కు తరలించారు.

గంటన్నర తర్వాత ఫిట్స్ వస్తోందని స్కానింగ్ ​తీయాలని డాక్టర్​ చెప్పడంతో తీసుకెళ్లగా స్కానింగ్​సెంటర్​లోనే విక్టోరియా చనిపోయింది. ఆమె మృతికి డాక్టర్లే కారణమంటూ డెడ్​బాడీతో హాస్పిటల్​ముందు బంధువులు ఆందోళనకు దిగారు.  బాధిత కుటుంబానికి  న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఘనంగా కుమ్రంభీం జయంతి 

హుజుర్ నగర్, వెలుగు: హుజూర్​నగర్​లో కుమ్రంభీం జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ స్కూల్​లో జరిగిన కార్యక్రమంలో భీం ఫొటోకు జువైనల్ జస్టిస్ బోర్డ్ మెంబర్ జి.మోహన్ రావు నాయక్ నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ భీం ఆదివాసీ, గిరిజనుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేశారని అన్నారు. కార్యక్రమంలో గిరిజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు నగేశ్​రాథోడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ లీలాధర్ నాయక్ , విద్యార్థులు పాల్గొన్నారు.

బీజేపీని గెలిపించండి

సంస్థాన్​ నారాయణపురం, వెలుగు: బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్​రావు కోరారు. శనివారం సంస్థాన్​ నారాయణపురం మండలంలోని పలు గ్రామాల్లో ఇన్​చార్జి నందకుమార్​యాదవ్​, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి కోసమే రాజగోపాల్​రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, ఆయన గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అభివృద్ధి చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆయన వివరించారు. ప్రచారంలో రవీందర్, నర్సింగ్ రావు, దశరథ, మహేందర్, రమేశ్, నరసింహాచారి పాల్గొన్నారు.