యాదగిరిగుట్టలో బ్రేక్ దర్శనాలు షురూ

యాదగిరిగుట్టలో బ్రేక్ దర్శనాలు షురూ
  • తొలిరోజు బ్రేక్ ​టికెట్లతో 292 మందికి దర్శనం

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం నుంచి బ్రేక్ దర్శనాలు మొదలయ్యాయి. మొదటిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు మొత్తం 292 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రూ.300 చెల్లించి బ్రేక్ టికెట్​తీసుకున్న భక్తులు 15 నుంచి 20 మంది అయ్యే వరకు ఆలయ ఉత్తర మాడవీధుల్లో కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. బ్రేక్ దర్శనాల టైంలో సాధారణ, వీఐపీలకు ఎలాంటి దర్శనాలు ఉండవని ఈవో గీతారెడ్డి తెలిపారు. కార్తీక పూజలతో గుట్టపై భక్తుల కోలాహలం కనిపించింది. కొండపైన ప్రధానాలయం, శివాలయం, విష్ణుపుష్కరిణి, కొండ కింద లక్ష్మీపుష్కరిణి, వ్రత మండపం ముంగిట దీపారాధన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కలు చెల్లించుకున్నారు. వ్రత మండపంలో ఆరు విడతలుగా నిర్వహించిన సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేవలం వ్రతాల ద్వారానే సోమవారం ఆలయానికి రూ.2,83,200 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 

8న ఆలయం మూసివేత
ఈ నెల 8న సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఈవో గీతారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 8న మధ్యాహ్నం 2:37 గంటలకు గ్రహణం మొదలై సాయంత్రం 6:19వరకు ముగుస్తుందని తెలిపారు. ఉదయం 6:15 నుంచి 7:30 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తామని, తర్వాత బంద్​చేస్తున్నట్లు పేర్కొన్నారు. తర్వాతి రోజు ఆలయాన్ని బంద్ చేయనున్నారు. 9న యధావిధిగా దర్శనాలు, పూజలు కొనసాగనున్నాయి.