ఫ్రీ వాటర్ స్కీంకు కరోనాతో బ్రేక్

V6 Velugu Posted on Apr 24, 2021


హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీలో ఫ్రీ వాటర్ ​స్కీం కోసం ఆధార్​ వివరాల సేకరణకు కరోనా సెకండ్​వేవ్​తో బ్రేక్​పడింది. ఆధార్ ​సీడింగ్ ​ప్రాసెస్ మొదలుపెట్టి 4 నెలలు గడుస్తున్నా.. వివరాల నమోదు నాలుగు లక్షలు కూడా దాటలేదు. గ్రౌండ్ ​లెవెల్లో సిబ్బంది పనిచేస్తున్నా.. కరోనా కారణంగా వినియోగదారులు వారిని ఇండ్లల్లోకి రానివ్వడం లేదు. దీంతో నెల రోజులుగా ఆధార్ ​సీడింగ్​కు బ్రేకులు పడుతూనే ఉన్నాయి. మరో వారం రోజుల్లో గడువు ముగియనుంది. గడువు పొడిగిస్తే గానీ ఆధార్ సీడింగ్​పూర్తయ్యేలా కనిపించట్లేదు. ఇప్పటికీ డివిజన్ల వారీగా టార్గెట్లు విధించి సీడింగ్ చేస్తున్నా, ఓ కొలిక్కి రావడం లేదు. ఫ్రీ వాటర్ స్కీం కోసం ఆధార్ వివరాల సేకరణను జనవరి 12న వాటర్ బోర్డు మొదలుపెట్టింది. తొలుత బస్తీలు, డొమెస్టిక్ నల్లాల కోసం రీడర్లను ఏర్పాటు చేసి బయోమెట్రిక్ వివరాలతో క్యాన్ నంబర్లను లింక్ చేసింది. ఆ తర్వాత అపార్టుమెంట్లు, ఎంఎస్బీ నల్లా కనెక్షన్ల కోసం చేపడుతుండగా, 4 నెలలుగా 4 లక్షలు దాటలేదు. వినియోగదారుల నుంచి సహకారం లేకపోవడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. 20 రోజులుగా మొదలైన కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ​కూడా దీనిపై పడింది. ఓల్డ్ సిటీ, బస్తీలు, అపార్టుమెంట్లలోకి వెళ్లాలంటేనే సీడింగ్​ సిబ్బంది భయపడుతున్నారు. 

ఇంట్రెస్ట్​చూపిస్తలేరు

ఆధార్ ​సీడింగ్​ను  మార్చి 31లోగా పూర్తిచేయాలని ప్రభుత్వం టార్గెట్​ పెట్టింది. అయితే ఈ మూడు నెలల్లో 40 శాతం కూడా పనులు పూర్తవ్వలేదు. ఆ తర్వాత గడువును ఏప్రిల్​30 వరకు పెంచింది. అయితే ఆ గడువులోపు కూడా ఆధార్ ​సీడింగ్​పూర్తయ్యేట్లు కనిపించడం లేదు. కరోనా వల్ల వినియోదారులు ఇండ్లలోకి అనుమతించకపోవడం, ఆఫీసులకు వచ్చి సీడింగ్ ​చేసుకోవడానికి వినియోగదారులు ఆసక్తి చూపకపోవడంతో లేట్​అవుతోంది. ఆన్​లైన్ ​ప్రాసెస్​ అంతా గందరగోళంగా ఉండటంతో అందులో అప్లయ్ చేసుకోవడానికి జనం ఇంట్రెస్ట్ ​చూపించడం లేదు. చాలా అపార్టుమెంట్లలో క్యాన్‌‌‌‌‌‌‌‌ నంబర్లు, ఇంటి నంబర్లు, ఆధార్ వివరాలకు మధ్య తేడాలు ఉంటున్నాయి. వీటన్నింటిని సరిచేసేందుకు వినియోగదారులు, అధికారులు ఇబ్బంది పడుతున్నారు. క్యాన్ నంబర్లకు ఉన్న ఫోన్ నంబర్లతోనే ఆధార్ సీడింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తే ప్రక్రియ వేగంగా పూర్తయ్యేదని వాటర్ బోర్డులోని ఓ అధికారి తెలిపారు. కానీ ఆధార్ వివరాల సేకరణతో పాటు పీటీఐఎన్ నంబర్, క్యాన్ నంబర్లు, ఆధార్ వివరాలతో సరిపోక సీడింగ్ ప్రక్రియ ముందుకు సాగట్లేదు. 

గడువు పెంచాల్సిందేనా

రెవెన్యూ లాస్, రెవెన్యూ పెంపు, వృథా నీటి నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి నల్లా కనెక్షన్​తో ఆధార్ అనుసంధానం చేయాలని ఆదేశాలు ఉన్నాయి. మరో వారం రోజుల్లో సీడింగ్ వివరాలకు గడువు ముగియనుంది. 10.6 లక్షల నల్లా కనెక్షన్ల ఆధార్ సీడింగ్ పూర్తికి మరోసారి గడువు పెంచే అవకాశం ఉందని వాటర్​బోర్డు అధికారుల నుంచి సమాచారం. కానీ గడువు పెంచిన ప్రతిసారీ నల్లా బిల్లులు జారీ ఆగిపోతుంది. దీంతో నెలవారీగా ఏరియర్స్ పేరుకుపోతున్నాయి. గత నాలుగు నెలలుగా వాటర్ బిల్లులను వసూలు చేయట్లేదు. ఈ క్రమంలో ప్రతి నెల 20 వేల లీటర్లు పోనూ వాడిన నీటికి బిల్లులను ఒకేసారి చెల్లించాలన్నా వినియోగదారులపై భారం పడనుంది.  

Tagged ghmc, Break, Aadhaar data collection, free water scheme

Latest Videos

Subscribe Now

More News