తిరుపతిలో ఆక్సిజన్ సరఫరాకు బ్రేక్.. 10మంది రోగులు మృతి

తిరుపతిలో ఆక్సిజన్ సరఫరాకు బ్రేక్.. 10మంది రోగులు మృతి
  • రూయా ఆస్పత్రి కరోనా వార్డు వద్ద ఉద్రిక్తత

తిరుపతి: రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో పది మంది కరోనా రోగులు మృతి చెందినట్లు సమాచారం. మరికొంత మంది రోగుల పరిస్థితి విషమంగా ఉందని.. వారికి సీఆర్పీసీ చేసి బతికించేందుకు వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆక్సిజన్ సరఫరా కు అంతరాయంపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యం కావడం వల్ల అంతరాయం కలిగిందని కొందరు సిబ్బంది చెబుతున్నారు. ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు కంప్రెజర్ తగ్గడంతో సరఫరాకు అంతరాయం కలిగినట్లు మరో మాట చెబుతున్నారు. స్పష్టమైన కారణం తెలియనప్పటికీ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది హడావుడి చూస్తుంటే ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది వాస్తవమేనని తేలుతోంది. కోవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో వైద్యులు చికిత్స చేసేందుకు పడుతున్న ప్రయాసలు నిజమేనని నిర్ధారిస్తున్నాయి. 

ఐసీయూలో ఫర్నీచర్ ధ్వంసం
ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి తమ వారికి చికిత్స చేయడం లేదంటూ రోగుల బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. 10 మంది చనిపోయినట్లు సమాచారం అందుతోంది. ఆస్పత్రిలోని ఎంఎం 1,2,3 వార్డుల్లో ఆరుగురు, ఐసీయూలో ముగ్గురు, ఎంఎం4,5,6 వార్డుల్లో ఒకరు చొప్పున చనిపోయినట్లు సమాచారం.  దీంతో కరోనా రోగుల బంధువులు పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేస్తుండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులతో రోగుల బంధువుల వాగ్వాదాలతో ఆస్పత్రి ప్రాంగణంలో ఉద్రిక్తత ఏర్పడింది. రోగుల బంధువులకు సర్దిచెప్పేందుకు ఆక్సిజన్ సరఫరా మళ్లీ మొదలయ్యిందని అధికారులు చెబుతున్నా.. లోపల వార్డుల్లో పరిస్థితి చాలా భయంకరంగా ఉందని రోగుల బంధువులు వీడియోలు చూపిస్తున్నారు. వాటిని ప్రసారం చేస్తే కఠిన శిక్షలు తప్పవంటూ అధికారులు హెచ్చరిస్తుండడంతో మీడియాలో పూర్తి స్థాయిలో వీడియోలకు బ్రేక్ పడింది. తమ వారు చనిపోవడానికి ఆక్సిజన్ లేకపోవడమేనని.. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆస్పత్రి ఐసీయూ వార్డులో వస్తువులను రోగుల బంధువులు పగులగొట్టారు. దీంతో నర్సులు, డాక్టర్లు, సిబ్బంది పరుగులు తీశారు. కోపంగా ఊగిపోతున్న రోగుల బంధువులు నర్సులు. డాక్టర్లు, సిబ్బంది ఉన్న గదుల తలుపులు బద్దలు కొట్టేందుకు యత్నం చేస్తున్నారు. దీంతో మరికొంత మంది వైద్య సిబ్బంది  కోవిడ్ ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు.