‘కరోనా’ వస్తది.. మేం ఊదం!

‘కరోనా’ వస్తది..  మేం ఊదం!

   ట్రాఫిక్​ పోలీసులతో మందుబాబుల లొల్లి

    బ్రీత్​ ఎనలైజర్​ టెస్ట్​లకు ససేమిరా

     ట్రాఫిక్​ పోలీసులతో వాగ్వాదం

కరోనా వైరస్ పుకార్లు ట్రాఫిక్ పోలీసులకు సమస్యగా మారాయి. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ తో కరోనా వైరస్ ఎటాక్ అవ్వొచ్చంటూ సోషల్​ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కొందరు మందుబాబులు అస్త్రంగా మార్చుకుంటున్నారు. బ్రీత్​ ఎనలైజర్​ టెస్ట్​తో ఎలాంటి ఫ్లూ రాదని, కరోనా వైరస్​కు అసలు ఆస్కారమే లేదని డాక్టర్లు, ట్రాఫిక్​ పోలీసులు చెబుతున్నా వాళ్లు వినడం లేదు. ఫైన్లు, శిక్షల నుంచి తప్పించుకునేందుకు మందుబాబులు సోషల్​ మీడియా ప్రచారాన్ని బూచీగా చూపి ఎత్తులు వేస్తున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలకు సహకరించడం లేదు. పైగా ట్రాఫిక్​ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​, బంజారా హిల్స్​ తదితర ప్రాంతాల్లో కొన్నిరోజులుగా ఇలాంటి పరిస్థితే ట్రాఫిక్​ పోలీసులకు ఎదురవుతోంది. సాధారణ వాహనదారులు బ్రీత్​ ఎనలైజర్​ టెస్ట్​కు సహకరిస్తున్నారని, మందుబాబులు మాత్రమే లొల్లి పెడుతున్నారని ట్రాఫిక్​ పోలీసులు అంటున్నారు.

వాదా ఫౌండేషన్​ లేఖతో..

బ్రీత్ ఎనలైజర్ల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని వాదా ఫౌండేషన్  వ్యవస్థాపకుడు పి.సురేశ్​రాజు గత నెల 30న పోలీస్​ కమిషనర్​ అంజనీకుమార్​కు లేఖ రాశారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్  చేసే ట్రాఫిక్  పోలీసులతోపాటు వాహనదారులకు వైరస్ వ్యాపించే అవకాశాలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలపై నియంత్రణ, బ్రీత్ ఎనలైజర్ల వినియోగంపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

డివైజ్ వల్ల వైరస్ రాదు

రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. డ్రంకెన్  డ్రైవ్  తనిఖీల్లో ఫ్లూ వైరస్ అటాక్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ.  బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో శ్వాసను డివైజ్ లోకి ఊదుతారు కానీ పీల్చుకోరు. దీంతో ఎలాంటి వైరస్ అటాక్ అవ్వదు. తుప్పర్లు, ఉమ్ము వల్ల మాత్రమే కరోనా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది.  – కృష్ణమూర్తి,
పల్మనాలజిస్ట్, గాంధీ హాస్పిటల్

మందుతాగినోళ్లే లొల్లిపెడుతున్నరు

కరోనా వైరస్ విషయంలో మేము అప్రమత్తంగానే ఉన్నాం.  సాధారణ వాహనదారులు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కు సహకరిస్తున్నారు. అతిగా మద్యం తాగిన వారు మాత్రమే వాగ్వాదానికి దిగుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డ్రంకెన్  డ్రైవ్ టెస్ట్ వల్ల కరోనా వ్యాప్తి లాంటి  వదంతులను నమ్మొద్దు.

– ఓ  ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి