కొండపై ఇళ్లు.. పల్టీలు కొడుతూ ఇలా కొట్టుకుపోయాయి: ముంబైలో ఘోర ప్రమాదం

కొండపై ఇళ్లు.. పల్టీలు కొడుతూ ఇలా కొట్టుకుపోయాయి: ముంబైలో ఘోర ప్రమాదం

ముంబై: మహారాష్ట్రను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ముంబై నగరం కుండపోత వానకు తడిసి ముద్దయిన పరిస్థితి ఉంది. ఇవాళ ఉదయం ముంబై శివారు ప్రాంతమైన భండప్ వెస్ట్ ప్రాంతంలో భయానక దృశ్యం కనిపించింది. స్థానికులు ఈ ఘటనతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు. అసలేమైందంటే.. గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముంబైలోని భండప్ వెస్ట్ ప్రాంతం నానిపోయింది.

కొండ ప్రాంతమైన ఇక్కడ కొండపై చాలా ఇళ్లు ఉన్నాయి. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ ఇళ్ల గోడలు నానిపోవడంతో కొండ చరియలు విరిగిపడటంతో పాటు ఆ ఇళ్లు కూడా కూలిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో ఆ వీడియోను చూసిన నెటిజన్లు అవాక్కయ్యారు. కొండలపై ఇళ్లు కట్టుకుంటే వర్షా కాలంలో ఎలాంటి ప్రమాద పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ ఘటన కళ్లకు కట్టింది.

ALSO READ : దంచికొడుతోన్న వాన.. ములుగు జిల్లాల్లో రికార్డ్ స్థాయిలో వర్షం..

దేశ ఆర్థిక రాజధాని ముంబైని గత కొన్ని రోజులుగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా దక్షిణ ముంబైలో వర్షం ప్రభావం తీవ్రంగా ఉంది. రోడ్లు, కాలనీలు అన్నీ చెరువులను తలపిస్తున్నాయి.

ప్రధాన రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. ఈ క్రమంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి.. సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ముంబైకి తాగునీరు అందించే చెరువులు పొంగి పొర్లుతున్నాయి.