
ITR 2025: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు సమయం దగ్గరపడటంతో చాలా మంది పన్ను చెల్లింపుదారులు హడావిడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఇల్లు అమ్మిన, షేర్లు విక్రయించినా లేదా బంగారం ఇటీవల సేల్ చేసిన వ్యక్తులు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. వీరు జూలై 23, 2024 తేదీకి సంబంధించిన టాక్స్ రూల్స్ మర్చిపోతే వారు 2024-25 ఆర్థిక సంవత్సరానికి అధిక పన్ను చెల్లించే అవకాశం ఉంది.
పన్ను శాఖ క్యాపిటల్ గెయిన్స్ లెక్కించటానికి జూలై 23, 2024న తీసుకొచ్చిన నిబంధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టాక్స్ పేయర్స్ చెల్లించాల్సిన పన్ను ఇప్పుడు ఆస్తి రకం లేదా దానిని ఎంతకాలం హోల్డ్ చేశారనే దానిపై మాత్రమే ఆధారపడి ఉండదు. దానిని ఎప్పుడు విక్రయించారనే దానికి విభజన రేఖ జూలై 23గా పరిగణించనున్నట్లు ఫైనాన్స్ (నం. 2) బిల్లు 2024లో తీసుకొచ్చిన మార్పులు నిర్ణయిస్తాయి.
కొత్త రూల్ ప్రకారం మీరు చెల్లించాల్సిన క్యాపిటల్ గెయిన్స్ టాక్స్, ఇండెక్సేషన్ వంటి ప్రయోజనాలు ఇప్పుడు ఆస్థిని అమ్మే తేదీని బట్టి మారుతుంటాయి. ఎవరైనా జూలై 23కి మునుపు ఆస్తిని అమ్మితే దానికి పాత నియమాలు వర్తిస్తాయి. జూలై 23 తర్వాత అమ్మిన వాటిపై కొత్త నియమాలు వర్తిస్తాయని చట్టంలో తెచ్చిన మార్పు చెబుతోంది. ఉదాహరణకు రియల్ ఎస్టేట్ ఆస్తిపై దీర్ఘకాలిక మూలధన లాభాలు గతంలో ఇండెక్సేషన్‌తో 20% పన్ను విధించబడేవి. జూలై 23 తర్వాత ఇండెక్సేషన్ లేకుండా అది 12.5% స్థిరంగా ఉంటుంది. అయితే మీరు జూలై 23 కి ముందు ఆస్తిని కొనుగోలు చేసి.. ఆ తర్వాత విక్రయించినట్లయితే పన్ను చెల్లించే ఇండివిడ్యువల్స్, HUFలు రెండింటిలో తమకు అనుకూలమైనదాన్ని ఎంచుకోవచ్చు.
ఇక షేర్ల విషయానికి వస్తే.. ఏడాది హోల్డ్ చేసిన స్టాక్స్ ను జూలై 23కి ముందు విక్రయిస్తే 10 శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ వర్తిస్తుంది. అయితే జూలై 23 తర్వాత ఈ టాక్స్ 12.5 శాతంగా ఉంది. ఇక షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 15 శాతం నుంచి 20 శాతానికి పెరిగింది.
మారిన రూల్స్ కి అనుగుణంగా టాక్స్ ఫైలింగ్ కోసం వ్యక్తులు తమ ఆస్తి కొనుగోలు మరియూ విక్రయ తేదీలను తమ సీఏకి ఇచ్చేముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవటం ఉత్తమం. తప్పుడు తేదీలను అందిస్తే ఎక్కువ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ కట్టే ప్రమాదం ఉంది. ఇది వేలల్లో పన్ను భారాన్ని పెంచుతుందని పన్ను నిపుణులు హెచ్చరిస్తు్న్నారు.