
Tech Hiring: ప్రపంచ వ్యాప్తంగా మారిపోతున్న సాంకేతిక విప్లవంతో పాటు ప్రపంచ రాజకీయ భౌతిక పరిణామాలతో టెక్ పరిశ్రమ కీలక మార్పులకు లోనవుతోంది. దీనికి నిశితంగా పరిశీలిస్తున్న భారత ఐటీ పరిశ్రమలోని కంపెనీలు దానికి అనుగుణంగా తమ ఉద్యోగుల హైరింగ్ ప్రక్రియను మార్చాయి.
ఈ ఆర్థిక సంవత్సరం మెుదటి త్రైమాసికంలో భారత ఐటీ కంపెనీల్లో అట్రిషన్, హైరింగ్ ట్రెండ్ పూర్తిగా ప్రతి కంపెనీకి భిన్నంగా మారిపోయాయి. ముందుగా పెద్దన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మెుదటి త్రైమాసికంలో 6వేల 071 మేర ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంది. ఈ క్రమంలో అట్రిషన్ రేటు 13.8 శాతం వద్ద ఉన్నట్లు వెల్లడించింది. దీంతో మెుత్తం టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6లక్షల 13వేల 069కి చేరుకుంది. అయితే ఏఐ కారణంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించబోమని చీఫ్ హెచ్ఆర్ మిలింద్ లఖ్కడ్ చెప్పారు. తమ ప్లాన్ కి అనుగుణంగానే హైరింగ్ ఉంటుందన్నారు. డిమాండ్ ఆధారంగా లేటరల్ ఎంట్రీపై నిర్ణయం ఉంటుందని కంపెనీ పేర్కొంది.
ఇక మరో టాప్ టెక్ కంపెనీ అయిన హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఉద్యోగుల హైరింగ్ 15 నుంచి 20 శాతం మధ్య పెంచాలని చూస్తోంది. అలాగే ఉద్యోగుల అట్రిషన్ రేటు 12.8 శాతంగా ఉండటంతో నికర ప్రాతిపధికన 269 మంది ఉద్యోగులు తగ్గినట్లు తొలి త్రైమాసికంలో చెప్పింది. దీంతో ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య 2లక్షల 23వేల 151కి పరిమితం అయ్యింది. కొత్తగా క్యూ1లో 1984 మందిని చేర్చుకుంది. ఇక ఫ్రెషర్ల నియామకంపై తన వైఖరిని పంచుకున్న కంపెనీ.. కేవలం నైపుణ్యం ఉన్న స్పెషలైజేషన్ కలిగిన వారికే అవకాశం అని చెప్పేసింది. ప్రతిభ కలిగిన ఉద్యోగులను ఆకట్టుకునేందుకు తమ వేతన ప్లాన్ మార్పులు చేసినట్లు చెప్పింది. బేస్ కంపెన్సేషన్ రూ.4లక్షల 25వేలుగా నిర్ణయించినట్లు చెప్పింది.
►ALSO READ | యూట్యూబ్ సంచలన నిర్ణయం.. వేలాది చైనా,రష్యా ఛానెళ్ల తొలగింపు
ఇక టాప్-5 ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న విప్రో మాత్రం జాగ్రత్తగా ఉద్యోగుల నియామకాలను చేపడుతోంది. కంపెనీలో అట్రిషన్ రేటు 15.1 శాతంగా ఉండగా.. తొలి త్రైమాసికంలో నికరంగా ఉద్యోగుల సంఖ్య 114 మేర తగ్గి 2లక్షల 33వేల 232కి చేరినట్లు కంపెనీ వెల్లడించింది. సంస్థ తన క్యాంపస్ రిక్రూట్మెంట్ల డ్రైవ్ కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఏఐ టాలెంట్ ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు అంతర్గతంగా ఉద్యోగులకు ట్రైనింగ్ అందిస్తోంది. అనేక భారతీయ టెక్ కంపెనీలు ఏఐ పై ఎక్కువగా ఫోకస్ కొనసాగిస్తున్నాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే ఇండియన్ టెక్ కంపెనీలు తమ నియామకాలను తగ్గించినట్లు క్లియర్ గా కనిపిస్తోంది.