
తిరుమల శ్రీవారి భక్తులకు ఇంకా ఎక్కువ నాణ్యమైన ప్రసాదాన్ని అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా జులై 22 మంగళవారం తిరుమల కొండపై కొత్తగా ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ను టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి కలిసి ప్రారంభించారు.
ఇప్పటి వరకు స్వామివారి ప్రసాదాలు, నెయ్యి లాంటి వస్తువుల నాణ్యతను పరీక్షించేందుకు ఇతర రాష్ట్రాలకు నమూనాలు పంపాల్సి వచ్చేదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. ఇక అలాంటి ఇబ్బంది లేకుండా .. ఇప్పుడు తిరుమల కొండపైనే శ్రీవారి ప్రసాదాల నాణ్యతను అత్యాధునిక పరికరాలతో నేరుగా పరీక్షలు నిర్వహించేందుకు ల్యాబ్ ను ఏర్పాటు చేశామన్నారు.
టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ ఇప్పటివరకు తిరుమలలో నెయ్యి నాణ్యతను పరీక్షించే వసతి లేదని, ఇప్పుడు తొలిసారి నెయ్యిలో కల్తీ శాతం, నాణ్యత శాతాన్ని తక్షణమే విశ్లేషించే సామర్థ్యంతో కూడిన GC (Gas Chromatograph), HPLC (High Performance Liquid Chromatograph) వంటి పరికరాలను ఏర్పాటు చేశామన్నారు. రూ.75 లక్షలు విలువైన ఈ పరికరాలను గుజరాత్ లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (NDDB) విరాళంగా అందజేసిందని తెలిపారు.
ల్యాబ్ సిబ్బంది, పోటు కార్మికులకు మైసూర్‌లోని CFTRIలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇకపై స్వామివారి ప్రసాదాల నాణ్యతను తిరుమల కొండపై ల్యాబ్‌లో శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలోనే పరిశీలించేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతా రామ్, సదాశివరావు, నరేష్, సిఈ సత్య నారాయణ, డిప్యూటీ ఈవోలు భాస్కర్, సోమన్నారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు.