
కాగజ్ నగర్, వెలుగు: గురుకుల విద్యాలయాల్లో సీటు ఇప్పిస్తానని విద్యార్థుల తల్లిదండ్రులను నమ్మించి డబ్బులు వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు మంగళవారం మీడియా ముందుకు వచ్చి అధికారులకు ఫిర్యాదు చేశారు. మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాల్లో సీటు ఇప్పిస్తానని ఆసిఫాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి మంత్రి సీతక్క అనుచరుడినని చెబుతూ ఆసిఫాబాద్‌కు చెందిన కామ్రే ప్రశాంత్, సిర్పూర్, కౌటాలతోపాటు పలు మండలాల్లోని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒక్కో సీటుకు రూ.10 వేల నుంచి రూ.20 వేల చొప్పున మాట్లాడుకున్నాడని, అడ్వాన్స్ గా ఒక్కొక్కరి వద్ద రూ.10 వేలచొప్పున తీసుకున్నట్లు చెప్పారు.
మంత్రి పేరుతో ఒక లెటర్ చూపించి నమ్మించాడని తెలిపారు. హాస్టల్ ఇదేనని చూపించి ప్రస్తుతం చదువుతున్న స్కూళ్ల నుంచి టీసీలు సైతం తీసుకోమని చెప్పడంతో తీసుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తీరా సీట్ల కోసం అడగ్గా సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు చెప్పారు. దీంతో సదరు వ్యక్తిపై కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.