
జీడిమెట్ల, వెలుగు: లంచం తీసుకున్న కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆఫీసుకు చెందిన ఇద్దరు వీఆర్ఏలు సస్పెన్షన్‌కు గురయ్యారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ గాజులరామారంలోని దేవేందర్‌నగర్‌లో వెలిసిన 250పైగా ఇండ్లను అధికారులు మంగళవారం కూల్చివేశారు. అయితే, కబ్జాదారుల నుంచి లంచాలు తీసుకొని అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చారని కుత్బుల్లాపూర్ వీఆర్ఏలు నాగేందర్, దేవేందర్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. కబ్జాదారుల నుంచి ఫోన్‌పే ద్వారా ఇద్దరు వీఆర్ఏలు లంచం తీసుకున్నట్లు తేలడంతో వారిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అడ్డగోలుగా లంచాలు తీసుకున్న కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆఫీసుకే చెందిన మరో వీఆర్ఏ వాసు ఇటీవల బ్యాంకాక్‌లో గ్యాంబ్లింగ్ గేమ్ లో దొరికి సస్పెండ్ గురైన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత మరో ఘటనలో ప్రభుత్వ భూమి కబ్జాకు గిర్దావర్ పరమేశ్వర్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. తాజాగా వీఆర్ఏలు దేవేందర్, నాగేందర్ ఫోన్ పే ద్వారా లంచాలు తీసుకుని సస్పెండ్‌కు గురవడంతో కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆఫీసులో వేటు పడిన వారి సంఖ్య నాలుగుకి చేరింది. అయితే, దేవేందర్‌నగర్‌లో రూ.వందల కోట్ల కుంభకోణంలో కేవలం కింది స్థాయి సిబ్బందిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులకు ఇచ్చిన డబ్బు వివరాలు, ఇచ్చిన ప్రదేశం, అధికారుల డ్రైవర్ల అకౌంట్లలో సైతం డబ్బులు వేశామని కబ్జాదారులే స్వయంగా వీడియోల్లో చెబుతున్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదని జనం మండిపడుతున్నారు. కమిటీ వేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.