లెహంగా నచ్చలేదని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు

లెహంగా నచ్చలేదని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు

ప్రస్తుత జనరేషన్ లో మనుషుల ఆలోచనలతో పాటు ఆచారాలు, కట్టు, బొట్టు విషయంలోనూ మార్పలొస్తున్నాయి. ఒకప్పుడు భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు చీరనే ధరించాలన్న ఆనవాయితీ ఉండేది. కానీ ఇప్పుడు చాలా చేంజ్ వచ్చింది. దాని వల్ల పెళ్లిళ్లు కూడా ఆగిపోతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ రోజుల్లో పెళ్లి అంటే అత్యంత సాధారణమైన విషయంగా మారిపోయింది. వరుడు సమయానికి రాలేదని.. మర్యాదలు జరగలేదని, విందు నచ్చలేదని.. ఇలా చిన్న చిన్న కారణాలతో పెళ్లిని రద్దుచేసుకుంటున్న వధూవరులూ లేకపోలేరు. అలాంటి ఘటనే ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. ఇంతకీ పెళ్లి ఆగిపోవడానికి కారణమేంటనుకున్నారు. లెహంగా.. అవును.. మీరు విన్నది నిజమే. లెహంగా నచ్చలేదని ఆ వధువు పెళ్లి వద్దంది. 

నైనిటాల్ హల్ద్వానీకి చెందిన యువతికి అల్మోరాకు చెందిన యువకుడుకి పెళ్లి నిశ్చయమైంది. ఇరు కుటుంబాల పెద్దలు నవంబర్ 5 పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే వివాహ వేడుకల్లో భాగంగా వరుడి తండ్రి రూ.10,000 విలువైన లెహంగాను ఆర్డర్ చేశారు. కాబోయే కోడలుకు ఆ లెహంగా పంపించగా అది పెళ్లి కూతురుకు నచ్చలేదు. ఈ  విషయం పెళ్లి కొడుకు ఇంటి సభ్యులకు తెలిసింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. చిన్న గొడవ కాస్తా పెద్దగా మారడంతో ఇరు కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అక్టోబరు 30న పెళ్లి కొడుకు బంధువులు వధువు ఇంటికి వెళ్లి లక్ష రూపాయల నగదు ఇచ్చి పెళ్లి రద్దు చేసుకునేలా ఒప్పందం కూడా చేసుకున్నారు.

అనంతరం పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు పెళ్లి విషయంలో మనసు మార్చుకున్నా ఫలితం లేకపోయింది. దాని వల్ల మళ్లీ గొడవ స్టార్ట్ అయింది గానీ.. పెళ్లి మాత్రం జరగలేదు. దీంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగి, అది పోలీసులకు ఫిర్యాదు చేసుకునేంత వరకు వెళ్లింది.