
- డ్రైవర్ల సమ్మెతో ఒడిశాలో వాహనం దొరకక తిప్పలు
రాయగడ(ఒడిశా): పెళ్లి తంతులో భాగంగా వరుడు గుర్రం మీదనో.. డెకరేట్ చేసిన కారులోనో పెళ్లి కూతురు ఇంటికి వస్తాడు. కానీ, ఇక్కడ ఓ పెళ్లి కొడుకు, అతని కుటుంబసభ్యులు 28 కిలోమీటర్లు నడుచుకుంటూ పెళ్లి కూతురు ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లాలో జరిగింది. జిల్లాలోని కళ్యాణ్‌సింగ్‌పూర్ బ్లాక్‌లోని సునాఖండి పంచాయతీకి చెందిన 22 ఏండ్ల వరుడు నరేశ్ ప్రస్కాకు గురువారం దిబలపాడు గ్రామానికి చెందిన అమ్మాయితో గురువారం వివాహం జరగాల్సి ఉంది. అయితే, ఒడిశాలో డ్రైవర్ల సమ్మె కారణంగా ఎలాంటి వాహనాలు తిరగలేదు. దీంతో ఏం చేయాలో వరుడి కుటుంబసభ్యులకు అర్థంకాలేదు. వేరే మార్గంలేక పెళ్లికొడుకుతో పాటు అతని కుటుంబసభ్యులు నడకను ఆశ్రయించారు. 28 కిలోమీటర్లు నడుచుకుంటూనే వెళ్లారు. పెళ్లికి కావాల్సిన సామగ్రిని బైక్‌లపై పంపించారు. గురువారం నడక ప్రారంభించిన వారు శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు వధువు గ్రామానికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం ఉదయం నరేశ్ ప్రస్కా వివాహం ఘనంగా జరిగింది.