పెద్దపల్లిలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలింది

పెద్దపల్లిలో  నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలింది
  • బీఆర్ఎస్​ హయాంలో రూ.51 కోట్లతో పనులు ప్రారంభం
  • ఎనిమిదేండ్లయినా పూర్తి చేయని కాంట్రాక్టర్​
  • ఈదురుగాలులకు ఒక్కసారిగా కూలిన వంతెన
  • కూలిన ప్రతీ కట్టడంపై విచారణ జరిపిస్తం: మంత్రి శ్రీధర్​బాబు

పెద్దపల్లి/ ముత్తారం, వెలుగు: పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దులోని ముత్తారం, టేకుమట్ల మండలాల మధ్య ఓడెడ్ వద్ద మానేరు నది పై నిర్మిస్తున్న బ్రిడ్జి సోమవారం రాత్రి ఈదురు గాలికి కుప్పకూలింది. ఆ సమయంలో వంతెన సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. బీఆర్ఎస్ హయాంలో 2016లో హైలెవల్ వంతెనకు అప్పటి మంత్రులు శంకుస్థాపన చేశారు. రూ.51.60 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించారు. ఎనిమిదేండ్లు గడుస్తున్నా వంతెన పనులు పూర్తి కాలేదు. సోమవారం రాత్రి వచ్చిన ఈదురు గాలికి ఒక్కసారి గా మూడు గార్డర్లు కుప్పకూలాయి. వంతెన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంవల్ల కాంట్రాక్టర్ నాసిరకంగా నిర్మించడంవల్ల వంతెన కూలిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. వంతెన పూర్తి కాకపోవడంతో ప్రజలు ప్రయాణించేందుకు వీలుగా ఇటీవల మానేరు నదిలో మట్టి రోడ్డు వేశారు. గార్డర్లు కూలినప్పుడు ఆ రోడ్డుమీద ఎవరు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది.

నాడు వరదకు టేకుమట్ల, నేడు గాలికి ఓడెడ్ బ్రిడ్జి..

ఓడెడ్​వద్ద గత బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్ 2016 లో హైలెవల్‌‌‌‌ వంతెన నిర్మాణం చేపట్టింది. స్థానిక బీఆర్ఎస్ నేత బినామీలే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి పనులు దక్కించుకున్నారనే ఆరోపణలున్నాయి. ఎనిమిదేండ్లు కొనసాగుతున్న ఈ బ్రిడ్జి పనుల్లో నాణ్యత లేదని విమర్శలున్నాయి. చర్యలు తీసుకోవడానికి ఆఫీసర్లు వెనుకాడుతూ వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్ట్​ రద్దు చేసిన ఆఫీసర్లు, కొత్తగా పరిపాలనా అనుమతులు కోరారు. ఈ లోగా వంతెన కాస్తా కుప్పకూలింది. 2018లో టేకుమట్ల, రాఘురెడ్డిపేట గ్రామాల నడుమ చలివాగుపై నిర్మించిన వంతెన కూడా ఇలాగే వరదకు కొట్టుకపోయింది. ఇప్పడు నిర్మాణంలో ఉన్న ఓడెడ్ బ్రిడ్జి గాలికి  కూలిపోయింది. అంతకుముందు మానేరు నదిపై రూ.290 కోట్లతో చేపట్టినచెక్​డ్యామ్​లు కొట్టుకపోయాయి.

జేబులు నింపుకోవడానికి కట్టారు

గత బీఆర్ఎస్ హయాంలో జేబులు నింపుకోవడానికే బ్రిడ్జిలు, బిల్డింగులు కట్టారని, కూలిపోతున్న ప్రాజెక్టులు, బ్రిడ్జిలను చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ఓడెడ్ వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి నాణ్యత లోపం వల్లే కూలింది.. దానిపై ఎంక్వైరీ జరిపిస్తం. బీఆర్​ఎస్ హయాంలో చేపట్టిన ప్రతి నిర్మాణంలో నాణ్యతాప్రమాణాలను మరోసారి టెస్ట్​ చేస్తం. బ్రిడ్జి కూలిపోవడానికి కారణమైన వారిపై  కఠిమైన చర్యలు తీసుకుంటం.- మంత్రి శ్రీధర్​బాబు

2019లోనే నోటీసులిచ్చాం

2016లో రూ.51.60 కోట్లతో బ్రిడ్జి పనులకు అనుమతులు ఇచ్చాం. 18నెలల్లో పూర్తి చేసేలా అగ్రిమెంట్ చేసుకుని సాయి కన్​స్ట్రక్షన్​కు పనులు అప్పగించాం. గడువులోగా కాంట్రాక్టర్​పనులను పూర్తి చేయలేదు. దీంతో 2019 డిసెంబర్ వరకు మూడు సార్లు ఈఓటీలు ఇచ్చాం. అయినా తీరు మారకపోవడంతో నోటీసులు ఇచ్చాం. కాంగ్రెస్ సర్కార్​వచ్చిన తర్వాత  జనవరిలో  కాంట్రాక్టును రద్దు చేసి, రూ.1.10 కోట్ల ఈఎండీ మొత్తాన్ని జప్తు చేశాం. రూ.63 కోట్లతో కొత్తగా ఎస్టిమేట్స్ తయారు చేసి పరిపాలనా అనుమతులు కోరినం. ఈలోగా ప్రమాదం జరిగింది.
- ఎస్ జే మోహన్ నాయక్, ఆర్అండ్​బీ సీఈ