ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఏఎన్ఎంలను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఫసియోద్దీన్ డిమాండ్ చేశారు. సోమవారం నాగర్ కర్నూల్  సీఐటీయూ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ కార్డులను ఏఎన్ఎంలతో పంపిణీ చేయిస్తున్నారని, గతంలో మాదిరిగా ఆరోగ్య మిత్రలే ఇచ్చేలా చూడాలన్నారు.

వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు.  ఏఎన్‌‌‌‌ఎంలు కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి పనిచేశారని, వాళ్లు మరణిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్‌‌‌‌గ్రేషియా కూడా ఇవ్వలేదని వాపోయారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకురాలు సుగుణ, హైమావతి, కళావతి, పర్వీన్, పుష్ప, జలజ తదితరులు పాల్గొన్నారు. 

కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో చిన్న, మధ్య తరహా,  భారీ పరిశ్రమల్లో పని చేసే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి కోరారు.  సోమవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  కలెక్టర్ వెంకట్‌‌రావుకు వినతి పత్రం అందజేశారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ పరిశ్రమల్లో పని చేసే కార్మికులకు పీఎఫ్‌‌ అమలు చేయలేదని, సేఫ్టీ పరికరాలు అందించడం లేదని వాపోయారు.

మహిళలకు ప్రత్యేక వసతులు కల్పించడం లేదని, గర్భిణులు, బాలింతలు, వారి పిల్లలకు క్రెచ్ సౌకర్యం కల్పించడం లేదన్నారు.  క్రషర్ మిషన్లలో పనిచేసేందుకు ఇతర రాష్ట్రాల కార్మికులకు తీసుకువచ్చి తక్కువ వేతనాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  రోజుకు 14 గంటలు పని చేయిసతూ శ్రమ దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. సీఐటీయూ నేతలు జాంగీర్, సత్యం ఉన్నారు.

మూలకు పడ్డ మెషీన్ డీజిల్ బిల్లులు

వనపర్తి, వెలుగు :  వనపర్తి మున్సిపాలిటీలో మూలకు పడ్డ స్వీపింగ్‌‌ మెషీన్ పేరిట డీజిల్ బిల్లులు తీసుకున్నారని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ ఆరోపించారు. సోమవారం కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చేందుకు తెచ్చిన స్వీపింగ్ మెషీన్‌‌ను తెచ్చిన కొత్తలోనే మూలకు పడేశారని గుర్తుచేశారు.  అయినా 2021 నుంచి ఇప్పటివరకు రూ.9.90 లక్షలు డీజిల్ బిల్లులు చేసుకున్నారని చెప్పారు. దీనిపై  విచారణ చేయించి డబ్బులు రికవరీ చేయాలని కోరారు.  

గతంలో తిరుమల్ రెడ్డిని ఉపయోగించుకుని చాలామంది జనరల్ ఫండ్ దోచుకున్నారని వారందరినీ విచారించాలని డిమాండ్ చేశారు. వనపర్తి ఊరికి బయట ఏర్పాటు చేస్తున్న రిజిస్ట్రేషన్ ఆఫీసును వనపర్తి పట్టణంలోనే ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు జానంపేట రాములు, నందిమల్ల చంద్రమౌళి, పొట్టినేని గోపాలకృష్ణ నాయుడు, దళిత సంఘం నాయకుడు నాగరాజు  పాల్గొన్నారు.

డ్యూటీని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు

జడ్చర్ల టౌన్​, వెలుగు:   టీచర్లు డ్యూటీని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌‌‌‌ వెంకట్‌‌రావు హెచ్చరించారు. సోమవారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటలోని ప్రైమరీ స్కూల్‌‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 8.35 గంటలకే స్కూల్‌‌కు చేరుకున్న ఆయన విద్యార్థులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు.  అనంతరం టీచర్లు స్కూల్‌‌కు ఎప్పుడు వస్తున్నారని స్టూడెంట్లు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి హాజరు పట్టికను  పరిశీలించారు.  హెడ్​మాస్టర్​ శ్రీలక్ష్మి 9.45 గంటలకు స్కూల్‌‌కు రావడంతో అప్పటి వరకు అక్కడే ఉన్న కలెక్టర్‌‌‌‌ ఆమెను సస్పెండ్​ చేశారు. ఆలస్యంగా వచ్చిన మరో టీచర్‌‌‌‌కు మెమో జారీ చేశారు.   

కలెక్టరేట్‌‌లో త్వరలోనే బయోమెట్రిక్ 

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: కలెక్టరేట్‌‌లో త్వరలోనే బయోమెట్రిక్ అటెండెన్స్‌‌ పద్ధతిని అమలు చేస్తామని కలెక్టర్ వెంకట్‌‌రావు తెలిపారు.   సోమవారం  రెవెన్యూ మీటింగ్ హాల్‌‌లో  ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు.  అనంతరం అధికారులతో నిర్వహించిన మీటింగ్‌‌లో  మాట్లాడుతూ అర్జీలు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు. సాధ్యం కాకుంటే కారణాలేంటో ఫిర్యాదుదారునికి రాతపూర్వకంగా తెలియజేయాలని సూచించారు.  ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించాలన్నారు. స్పెషల్ ఆఫీసర్స్ వారానికి రెండు సార్లు మండలాలకు వెళ్లి... ఆఫీసులతో పాటు చౌకధర దుకాణాలు, స్కూల్, హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్స్ తనిఖీ చేయాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, డీఆర్డీవో యాదయ్య పాల్గొన్నారు.

యాదవ కార్పొరేషన్ కోసం పోరాటం

యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు  

అచ్చంపేట, వెలుగు:  గొల్లకురుమ, యాదవులకు ప్రత్యేక కార్పొరేషన్ సాధించేవరకు పోరాటం కొనసాగిస్తామని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ స్పష్టం చేశారు. సోమవారం అచ్చంపేట పట్టణంలోని ఆర్‌‌‌‌అండ్‌‌బీ గెస్ట్ హౌస్‌‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 20 శాతం ఉన్న గొల్ల కురుమలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి,  బడ్జెట్లో రూ. 5 వేల కోట్లు కేటాయించాలని కోరారు. 60 లక్షల మంది ఓటర్లుగా తమ వర్గానికి అత్యధిక సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

1955 నుంచి1970 వరకు ఉన్న 10 శాతం ఎస్ఎన్టీ రిజర్వేషన్( అర్థ సంచార జాతి)ను అప్పటి ప్రభుత్వాలు రద్దు చేశాయని,   తిరిగి పునరుద్ధరించాలని కోరారు.  కార్పొరేషన్‌‌ ఏర్పాటు కోసం  33 జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు. శీతాకాల అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేక బడ్జెట్ కేటాయించకపోతే సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు  కుందేళ్ల శంకర్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకల శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి  మల్లేశ్ యాదవ్, నేతలు అమర్ యాదవ్,  దుడ్డు శ్రీను యాదవ్, వావిల్ల విష్ణు వర్ధన్ యాదవ్ పాల్గొన్నారు.