ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

వనపర్తి, వెలుగు:  మహబూబ్ నగర్ లో కొత్త కలెక్టరేట్ ను ప్రారంభించేందుకు డిసెంబర్ 4న సీఎం కేసీఆర్ వస్తున్నారని, అధిక సంఖ్యలో జనం తరలి వచ్చి సభ ను సక్సెస్​చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆయన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తయితే ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం అవుతుందని, కేసుల కారణంగా ఈ ప్రాజెక్ట్​ ఆలస్యమవుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మించడంతో జిల్లా స్వరూపం మారిపోయిందని మంత్రి గుర్తు చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్​లో  చికిత్స పొందుతున్న వనపర్తి మండలం అంజనగిరి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త తిమ్మయ్యను  మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరామర్శించారు. కార్యక్రమంలో పార్టీ  సీనియర్ నేత 
మెంటెపల్లి పురుషోత్తమ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

 

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీదే అధికారం


 నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు:  రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీదే అధికారమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ లో ఓ ఫంక్షన్ హాలులో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్​పాలనను గాలికొదిలేశారని విమర్శించారు. బంగారు తెలంగాణ అని చెప్పి రాష్ట్రాన్ని అప్పులమయం చేశారన్నారు. బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు, ఉద్యోగాలకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, రాష్ట్రంలోని ప్రభుత్వ భూములు అమ్ముతూ దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలని కోరారు. కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి, జిల్లా ఇన్​చార్జి నరేందర్ రావు, నగేశ్​పాల్గొన్నారు. 


బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరు

నారాయణపేట, వెలుగు: సంస్థాగతంగా బలపడితే బీజేపీ గెలుపును ఏ శక్తీ ఆపలేదని, తెలంగాణలో అధికారం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్.ప్రకాశ్​రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.రతంగ్ పాండురెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక శిలా గార్డెన్ లో పార్టీ జిల్లా అధ్యక్షుడు పగుడాకుల శ్రీనివాసులు అధ్యక్షతన పార్టీ సమావేశం జరిగింది. కార్యకర్తలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ పార్టీ గెలుపుకోసం అభివృద్ధి ఒక్కటే సరిపోదని సంస్థాగతంగా అన్ని కమిటీలు ఉండాలన్నారు. అన్ని కమిటీలు పూర్తి చేసి ప్రజా సమస్యపై పోరాడుతూ ప్రజల్లోకి దూసుకుపోవాలన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు  ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీని చూస్తున్నారన్నారు. సమావేశంలో లీడర్లు ప్రభాకర్ వర్ధన్, శ్రీనివాసులు,  సాయిబాబు, చెన్నారెడ్డి, అశోక్ , గోవర్ధన్ గౌడ్ పాల్గొన్నారు.


ఎన్నికల దృష్టితోనే  సీఎం జిల్లా పర్యటనలు

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: ప్రజల్లో వ్యతిరేకతను గ్రహించి సీఎం కేసీఆర్​ ముందస్తు ఎలక్షన్లకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని, దానిలో భాగంగానే జిల్లా పర్యటనలకు ప్లాన్​చేశారని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ జిల్లా ఆఫీసులో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశానికి చీఫ్​గెస్ట్ గా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం టీఆర్ఎస్​ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దాన్ని దృష్టి మరల్చేందుకు సీఎం కొత్త అంశాలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, జిల్లా ఇన్​చార్జి భరత్ కుమార్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలరాజు, లీడర్లు కృష్టయ్య నాయక్, సత్యం, నంబిరాజు, జయశ్రీ, ఎ.అంజయ్య పాల్గొన్నారు.  


గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలి

లింగాల, వెలుగు:  రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ  పిలుపునిచ్చారు. ఆదివారం లింగాల మండలం అవుసలికుంట గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప చరిత్ర కలిగిన కాంగ్రెస్ ముందు ఎన్నో పార్టీలు వచ్చిపోయాయని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్​ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ బలోపేతానికి గ్రామస్థాయిలో బూత్ కమిటీలు, యూత్ బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.  కార్యక్రమంలో ఎంపీపీ లింగమ్మ,  వైస్ ఎంపీపీ నారాయణ గౌడ్,  పార్టీ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రాథోడ్, టౌన్ ప్రెసిడెంట్ వెంకటయ్య, లీడర్లు షఫీ, ఇందిరమ్మ, విజయలక్ష్మి పాల్గొన్నారు. 
 

డిగ్రీ క్లాస్​మేట్స్​తో మంత్రి గెట్​ టు గెదర్

మహబూబ్​నగర్​, వెలుగు: రాజకీయాల్లోకి రావాలని తాను ఎప్పుడూ అనుకోలేదని, కానీ ఇప్పుడు ప్రజలకు సేవ చేయడం సంతోషంగా ఉందని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. ఆదివారం మహబూబ్​నగర్​ శివారులోని కేసీఆర్ ​అర్బన్​ ఎకో పార్కులో ఎంవీఎస్​ డిగ్రీ కాలేజ్​ 1985–-88  బ్యాచ్​గెట్ ​టు గెదర్  నిర్వహించారు. ఇదే బ్యాచ్​కు చెందిన మంత్రి శ్రీనివాస్​గౌడ్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగ జీవితం, టీజీవో స్థాపన, తెలంగాణ పోరాటం–రాష్ట్ర సాధన, ఎమ్మెల్యేగా ఎన్నికవడం, ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టడడం చూస్తుండగానే జరిగిపోయాయన్నారు. మహబూబ్​నగర్​ను ఊహించని స్థాయిలో అభివృద్ధి చేయడమే తన కర్తవ్యమని మంత్రి అన్నారు. అనంతరం పలువురు విద్యార్థి జీవితంలో గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. 


మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పంచాయతీ కార్మికుల మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై దండయాత్ర చేస్తా మని పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పాలడుగు భాస్కర్ హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులను తీవ్ర ఇబ్బందుల గురి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం వస్తే పంచాయతీ కార్మికుల బతుకులు మారుతాయని భావించామని, కానీ అవేమీ నెరవేరలేదన్నారు.  ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 
కార్యక్రమంలో నాయకులు గణపతి, వెంకటయ్య, జయలక్ష్మి, సుధాకర్, ఆర్.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.  


ఏకాగ్రతతో సాధన చేస్తేనే విజయం

వనపర్తి టౌన్, వెలుగు: ఏకాగ్రతతో సాధన చేస్తే తప్పక విజయం సాధించవచ్చని వనపర్తి ఎస్పీ కె.అపూర్వరావు అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫిజికల్ ట్రైనింగ్​ తీసుకుంటున్న అభ్యర్థులకు ఆదివారం  సైనా నెహ్వాల్ రన్నింగ్​ కోచ్  గోనె రవీందర్ పలు సూచనలు చెప్పారు. రన్నింగ్, హైజంప్, బ్రీతింగ్ కంట్రోల్ అంశాలపై టెక్నిక్స్​ చెప్పారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాసం తో ఫిజికల్ టెస్ట్ లకు హాజరై విజయం సాధించాలన్నారు. అనంతరం పోలీస్ శాఖ,  సాహితీ కళావేదిక   ఆధ్వర్యంలో కోచ్  రవీందర్, మెకానిక్ శ్రీను , రవి సాగర్ ను ఎస్పీ చేతుల మీదుగా సన్మానించారు. కార్యక్రమంలో టౌన్ ఎస్సై యుగంధర్ రెడ్డి, కోచింగ్ ట్రైనర్లు రాజగౌడ్, గౌస్ పాష,  రమేష్ బాబు, సాహితి కళావేదిక అధ్యక్షులు శంకర్ గౌడ్, చంద్రశేఖర్, భాస్కర్, ఫిజికల్ డైరెక్టర్లు, సురేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నిరంజన్ గౌడ్ పాల్గొన్నారు.