ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

యాదాద్రి, వెలుగు :  యాదాద్రి జిల్లాకు నాలుగు బస్తీ దవాఖానాలు రానున్నాయి. జిల్లాలోని భువనగిరి మున్సిపాలిటీకి మూడు, చౌటుప్పల్​ మున్సిపాలిటీకి ఒక్క దవాఖాన  మంజూరయ్యాయి. ఈ దవాఖానాలకు నాలుగురు  స్టాఫ్​ నర్స్​ల పోస్టులు కూడా మంజూరయ్యాయి. వీటితో జిల్లాలోని 24 గంటల పీహెచ్​సీలకు ఐదు స్టాఫ్​ నర్స్​ల పోస్టులు మంజూరయ్యాయి. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్​ ప్రకారం సెలక్షన్​ లిస్ట్​ అభ్యర్థులకు సమాచారం అందించనున్నారు. ఈ నెల 23న కౌన్సెలింగ్​ నిర్వహించి,  మెరిట్​, రోస్టర్​ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.  దీంతో పాటు  జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు ఉండగా మొదటి విడతలో మేజర్​ మున్సిపాలిటీ  మంజూరు చేశారు. ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు, భూదాన్​ పోచంపల్లికి బస్తీ దవాఖానాలు మంజూరు కావాల్సి ఉంది. 

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

చండూరు (మర్రిగూడ), వెలుగు: మండలంలో పెండింగ్​లో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం ఎంపీడీవో ఆఫీస్​లో ఎంపీపీ మొండు మోహన్​రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించి పూర్తి స్థాయిలో వైద్యం అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. అనంతరం కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, సూపరింటెండెంట్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్​  చైర్మన్ ను లోపలే ఉంచిపంచాయతీ గేటుకు తాళం

చౌటుప్పల్ వెలుగు:  చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని తంగడపల్లిలో కొత్త పీహెచ్​సీని శనివారం మున్సిపల్​చైర్మన్​ వెన్​రెడ్డి రాజు, ఎంఈవో శివప్రసాద్​తో కలిసి ప్రారంభించారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ మున్సిపల్​చైర్మన్, ఇతర అధికారులు లోపలే ఉంచి తంగడపల్లి మాజీ సర్పంచ్ కొండూరు వెంకన్న, గ్రామస్తులు పంచాయతీ గేటుకు తాళం వేశారు. గేటు తీయమని చైర్మన్​, కౌన్సిలర్ల వారించినా వినలేదు. గ్రామస్తులు మాట్లాడుతూ తంగడపల్లి లో మంజూరైన  పీహెచ్​సీ భవనం అసంపూర్తిగా  మధ్యలోనే ఆగిపోయిందని, దానిని తిరిగి ప్రారంభించకుండా గ్రామ పంచాయతీని వాడుకోవడం సరికాదన్నారు.  అనంతరం తాళం తీయడంతో మధ్యలోనే ఆగిపోయిన పీహెచ్​సీ భవనం వద్దకు మున్సిపల్ చైర్మన్, డాక్టర్లు, కౌన్సిలర్లతో సహా గ్రామస్తులు వెళ్లారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ జిల్లా మంత్రి,  ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో మాట్లాడి అసంపూర్తిగా ఉన్న భవనాన్ని రెండు మూడు నెలల్లో కట్టిస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అంతటి విజయలక్ష్మి బాలరాజు, ఆలే నాగరాజు, ఉప్పు వరమ్మ వెంకటయ్య, మండల వైద్యాధికారి శివప్రసాద్, పల్లె దవాఖాన డాక్టర్లు, ఫార్మసిస్టులు ల్యాబ్ టెక్నీషియన్లు తదితరులు ఉన్నారు.

దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి

సూర్యాపేట, వెలుగు :  దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ  జిల్లా మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా  జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వారి సంక్షేమం కోసం సబ్సిడీ రుణాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.  జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి జ్యోతి పద్మ,  సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ,  జిల్లా కార్యాలయ సూపరింటెండెంట్​ హుస్సేన్​, సీడీపీవోలు, జిల్లా సమన్వయకర్తలు పాల్గొన్నారు.

1 నుంచి జిల్లాలో సదరం​ క్యాంపులు

యాదాద్రి, వెలుగు :  దివ్యాంగుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని యాదాద్రి కలెక్టర్​ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో శనివారం  నిర్వహించిన దివ్యాంగుల కమిటీ మీటింగ్​లో కలెక్టర్​ మాట్లాడారు. వచ్చే నెల 1న జిల్లా వ్యాప్తంగా సదరం​ క్యాంప్​ నిర్వహిస్తామని తెలిపారు. డబుల్​ బెడ్​రూం ఇండ్ల కోసం అప్లయ్​ చేసుకున్న దివ్యాంగులకు ప్రయారిటీ ఇస్తామని చెప్పారు. స్వయం ఉపాధి కల్పించడానికి ట్రైనింగ్​ ఇచ్చి, లోన్లు ఇప్పిస్తామని తెలిపారు. దివ్యాంగుల కోసం టోల్ ఫ్రీ నెంబరు 18005728980 ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 

స్టూడెంట్స్​పై దృష్టి సారించాలి

విద్యార్థుల ఎదుగుదలపై తల్లిదండ్రులు, టీచర్స్​ దృష్టి సారించాలని కలెక్టర్​ సూచించారు. రాయగిరి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన టీచర్​, పేరెంట్స్​ మీటింగ్​లో మాట్లాడారు. పనుల ఒత్తిడిలో ఉన్నప్పటికీ పిల్లల కోసం కొంత సమయం కేటాయించుకొని మాట్లాడాలని చెప్పారు.  చిన్నతనంలో పిల్లలతో మాట్లాడకుంటే..పెద్దయ్యాక ఆ అవకాశం దొరకకపోవచ్చునని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ దీపక్​ తివారి, ఆర్డీవో ఉపేందర్​రెడ్డి, ఏసీపీ వెంకటరెడ్డి, డీఆర్​డీవో ఉపేందర్​రెడ్డి, వెల్ఫేర్​ ఆఫీసర్​ కేవీ కృష్ణవేణి, డీఈవో నారాయణరెడ్డి, పోరెడ్డి రంగయ్య, మున్సిపల్ చైర్మన్ 
ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య ఉన్నారు.

పోడు భూముల హక్కులపై వేగంగా చర్యలు 

మిర్యాలగూడ, వెలుగు :  పోడు భూముల హక్కుల వర్తింపునకు చర్యలను వేగవంతం చేశామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ వి. సర్వేశ్వర్ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక మండల పరిషత్ ఆవరణలో పోడు భూముల సర్వే, ఇతర అంశాలపై అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, ఆర్డీవో బి.  చెన్నయ్య డీటీ డబ్ల్యూ వో రాజ్ కుమార్ తో  సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు భూముల హక్కుల వర్తింపుకు ప్రభుత్వం రూపొందించిన  గైడ్ లైన్స్  ప్రకారం ముందుకు వెళ్తు న్నామన్నారు. పోడు భూముల సర్వేకు పంచాయతీరాజ్, ఫారెస్ట్, రెవిన్యూ అధికారులను కలిపి టీమ్​లుగా చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం 90 టీమ్​లు వచ్చిన  క్షేత్ర స్థాయిలో పోడు భూముల పరిస్థితిని అధ్యయనం  చేస్తున్నాయన్నారు.  ఈ సమావేశంలో ఎఫ్ డీ వో సర్వేష్,  ఎంపీడీఓ జ్యోతి లక్ష్మి, ఎమ్మార్వో అనీల్ తదితరులున్నారు.

వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేశాం

హుజూర్ నగర్, వెలుగు: ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తుందని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ ఉపాధ్యక్షుడు గొంగడి మహేందర్ రెడ్డి అన్నారు. హుజూర్ నగర్ మండలం అమరవరంలో పీఏసీఎస్​ భవనాన్ని ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే  శానంపూడి సైదిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం  రైతులకు అన్నిరకాల రుణాలను అందిస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే  శానంపూడి మాట్లాడుతూ వారం రోజుల్లో అమరవరం లిఫ్ట్​కు రిపేర్లు చేసి సాగు నీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఎంపీ మాట్లాడుతూ ఏకకాలంలో రుణ మాఫీ చేయాలని కోరారు. ఎంపీ మాట్లాడుతుండగా జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి అడ్డు తగలడంతో సమావేశం రసాభాసగా మారింది. సీఈవో మదన్ మోహన్, డీసీవో శ్రీనివాస్, డీసీఎంఎస్​ డైరెక్టర్  దొంగరి వెంకటేశ్వర్లు, పీఏసీఎస్​ చైర్మన్ అన్నెం శౌరిరెడ్డి, ఎంపీపీ గుడెపు శ్రీనివాస్, సర్పంచ్ గుజ్జుల సుజాత అంజిరెడ్డి పాల్గొన్నారు.

గ్రామాల్లో సౌలతులు కల్పిస్తున్నాం

దేవరకొండ (నేరెడుగొమ్ము), వెలుగు: గ్రామాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే రవీంద్రకుమార్​ చెప్పారు. శనివారం నేరెడుగొమ్ము మండల కేంద్రంలో రూ.75 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ, కాంపౌండ్​ వాల్​ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు అన్నిరంగాల్లో డెవలప్​ అవుతున్నాయని అన్నారు. మార్కెట్​ కమిటీ చైర్మన్​ శిరందాసు లక్ష్మమ్మ కృష్ణయ్య, జడ్పీటీసీ కేతావత్​ బాలు, పార్టీ మండల అధ్యక్షుడు లోకసాని తిరుపతయ్య, సర్పంచ్​ పల్స బాలమణి వెంకటయ్య, కేతావత్​ రవీందర్, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.