హైదరాబాద్​ను ముంచెత్తిన వాన.. గంటన్నరపాటు నాన్​ స్టాప్​

హైదరాబాద్​ను ముంచెత్తిన వాన..  గంటన్నరపాటు నాన్​ స్టాప్​
 
  • హైదరాబాద్​ను .. ముంచెత్తిన వాన
  • సాయంత్రం ఐదున్నర నుంచి గంటన్నరపాటు నాన్​ స్టాప్​
  • ఉరుములు, మెరుపులతో కుండపోత.. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
  • కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. అర్ధరాత్రి వరకు కూడా చాలా ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​ను వాన ముంచెత్తింది. సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన వర్షం.. గంటన్నరపాటు నాన్​స్టాప్​గా దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లన్నీ మోకాళ్ల లోతు వరకు నీళ్లతో నిండిపోయాయి. జనం ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే టైమ్​ కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికక్కడ కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ జామ్​ అయింది. దీంతో వాహనదారులు నరకం అనుభవించారు. అర్ధరాత్రి వరకు కూడా చాలా ప్రాంతాల్లో
వర్షం పడింది. 

చెరువులైన రోడ్లు.. అడుగడుగునా ట్రాఫిక్​ జామ్​

సిటీలోని ఏ రహదారిని చూసినా చెరువులను తలపించాయి. ఐటీ కారిడర్లతో పాటు అన్ని ప్రాంతాల్లో రోడ్లపై మోకాళ్లలోతు నీరు చేరడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై భారీ స్థాయిలో నీరు నిలిచి ఇండ్లలోకి వస్తుండటంతో పలుచోట్ల మ్యాన్‌‌‌‌హోళ్ల మూతలు తెరిచేశారు. ఎక్కడ వర్షపు నీరుందో.. ఎక్కడ గుంతలున్నాయో తెలియక వాహదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ మూవ్ మెంట్ అన్నిచోట్ల స్లోగా సాగింది. సాయంత్రం 5.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ జామ్​ తప్పలేదు. విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీనగర్ నుంచి వెళ్లే దారిలో చింతల్ కుంట అండర్​ పాస్ వద్ద  భారీగా వరద నీరు చేరింది. దీంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్  జామ్ అయింది. ఫనామ చౌరస్తా సమీపంలో హైవేపై పెద్ద ఎత్తున వరద నీరు నిలిచింది. ఇక్కడ కూడా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఎల్బీనగర్ లోని గ్లోబల్ ఆస్పత్రి వద్ద వరద నీరు భారీగా చేరింది. అంబర్ పేట- మూసారాంబాగ్ బ్రిడ్జిపై మోకాళ్ల లోతు వరకు నీళ్లు చేరడంతో  ప్రత్యామ్నాయంగా గోల్నాక బ్రిడ్జి మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. లింగంపల్లి రైల్వే అండర్ పాస్ వద్ద కూడా భారీగా వరదనీరు చేరింది. బషీర్ బాగ్, హైదర్ గూడ రోడ్డు చెరువులా మారింది. హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లోనూ రోడ్ల మీద భారీగా నీరు చేరి జనం ఇబ్బందులు పడ్డారు. హైటెక్ సిటీ, నానక్ రాంగూడ్ లోని ఐటీ ఉద్యోగులు ఇండ్లకు చేరుకునేందుకు రెండు, మూడు గంటల సమయం పట్టింది. చాలా ప్రాంతాల్లో ముందస్తు చర్యగా అధికారులు విద్యుత్‌‌‌‌ సరఫరా నిలిపేశారు.  

ఐదు సెంటీమీటర్లకు పైగా..!

ఓల్డ్ సిటీతో పాటు సరూర్ నగర్, అంబర్ పేట్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో రెండున్నర గంటల వ్యవధిలోనే 5 సెంటిమీటర్లకు  పైగా వర్షపాతం నమోదైంది. నాగోల్​లోని అయ్యప్ప కాలనీలోకి వరద నీరు భారీగా చేరడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడు ఏం జరుగుతుందో నని టెన్షన్​లో కాలనీ వాసులు పడ్డారు. వనస్థలిపురంలోని అల్తాఫ్ నగర్, గడ్డి అన్నారంలోని పీఎన్ టీ కాలనీ, సీసల బస్తీ, వీవీ నగర్​లో భారీగా వరద నీరు చేరింది. గాజుల రామారంలోని ఓక్షిత్ కాలనీలోకి వరద తీవ్రత మరింత పెరిగింది. కూకట్​పల్లిలోని బాలాజీ నగర్  కాలనీలోకి నీరు చేరింది. అనేక కాలనీల్లో జనం ఇండ్లకే పరిమితమయ్యారు. నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో మాన్సున్ టీమ్​లు కనిపించ లేదు. సడెన్​గా వర్షం పడటంతో డీఆర్ఎఫ్ టీమ్​లు స్పాట్​కు చేరుకునేందుకు సమయం పట్టింది.