ఇలాగే ఉంటే మార్పులు తప్పవు

ఇలాగే ఉంటే మార్పులు తప్పవు

పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకపోతే మార్పులు తప్పవని బీజేపీ ఎంపీలను ప్రధాని మోడీ హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాలకు సభ్యుల హాజరు తక్కువగా ఉండటంతో సొంత పార్టీ సభ్యులపై మోడీ విమర్శలు చేశారు. బీజేపీ సభ్యులు రెగ్యులర్‌గా సమావేశాల్లో పాల్గొనాలని ప్రధాని చెప్పారు. ఎంపీలు రెగ్యుల‌ర్‌గా సమావేశాలకు రాకపోతే ‘మార్పులు’ తప్పవని అని కూడా అన్నారు. పార్లమెంట్ ఎంపీలతో చిన్న పిల్లల్లా మాట్లాడటం తగదని మోడీ అన్నారు.  పార్లమెంటుకు క్రమం తప్పకుండా హాజరుకావాలని ఎంపీలకు చాలాసార్లు చెప్పామని మోదీ చెప్పారు. అయినా వారి తీరులో మార్పు రావడంలేదు. ఈ విషయంలో ఇకపై  వారు మారకపోతే.. సమయం చూసి మేమే మార్పులు చేస్తామని ఆయన అన్నారు. 

న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో మంగళవారం ఉదయం బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, ఎస్ జైశంకర్, ప్రహ్లాద్ జోషి, జితేంద్ర సింగ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇదే బీజేపీ తొలి పార్లమెంటరీ సమావేశం కావడం గమనార్హం.