ఇంట్లో నోట్ల కట్టల కేసు..సుప్రీంకోర్టుకెక్కిన జస్టిస్ యశ్వంత్ వర్మ

ఇంట్లో నోట్ల కట్టల కేసు..సుప్రీంకోర్టుకెక్కిన జస్టిస్ యశ్వంత్ వర్మ

ఇంట్లో నోట్ల కట్టలు కేసులో జస్టిస్ యశ్వంత్ వర్మ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై అభిశంసన సిఫార్సును రద్దు చేయాలని వర్మ సుప్రీంకోర్టును కోరారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తనపై అభిశంసన చర్యలు ప్రారంభమయ్యే అవకాశమున్నక్రమంలో జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన చర్యలను, త్రిసభ్య కమిటీ నివేదికను ఆయన సవాల్ చేశారు. 

ALSO READ | ఇన్వెస్టిగేషన్ పూర్తికాకుండానే నిందలా?..పైలట్ల సంఘం ఫైర్

జస్టిస్ యశ్వంత్ వర్మ కేసు భారత న్యాయవ్యవస్థలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  2025 మార్చి 14న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు ఒక గదిలో భారీగా కాలిన, పాక్షికంగా కాలిన కరెన్సీ నోట్ల కట్టలు లభించాయి. ఇది అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. సుమారు రూ. 15 కోట్ల వరకు నగదు బయటపడినట్లు వార్తలు వచ్చాయి.

సుప్రీంకోర్టు జోక్యం ,కమిటీ నియామకం..

ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సంజీవ్ ఖన్నా విచారణకు ఆదేశించారు. దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది. పంజాబ్-హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్ షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ చీఫ్ జస్టిస్ జీఎస్ సందావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూ శివరామన్  లతో త్రిసభ్యకమిటీలు వేశారు. 

కమిటీ విచారణ ,నివేదిక..

కమిటీ దాదాపు 50 మంది సాక్షుల వాంగ్మూలాలను సేకరించింది. ఇందులో జస్టిస్ వర్మ కుమార్తె, ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా, ఢిల్లీ అగ్నిమాపక దళం చీఫ్ అతుల్ గార్గ్ ల వాంగ్మూలాన్ని నమోదు చేసింది.నగదు లభించిన స్టోర్‌రూమ్‌కు సంబంధించి వీడియోలు, ఫోటోలను కూడా ఈ కమిటీ పరిశీలించింది. జస్టిస్ వర్మ నివాసంలోని స్టోర్‌రూమ్‌లో భారీగా నగదు లభించిందని, ఈ నగదును బయటవారికి తెలియకుండా ఉంచడానికి ప్రయత్నించారని కమిటీ నిర్ధారించింది. 

ఆ స్టోర్‌రూమ్‌పై జస్టిస్ వర్మ, ఆయన కుటుంబ సభ్యులకే  మాత్రమే ప్రత్యక్ష లేదా పరోక్ష నియంత్రణ ఉందని కమిటీ తెలిపింది. ఇంత పెద్ద మొత్తంలో నగదు బయటపడినా, జస్టిస్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం అనుమానాస్పదంగా ఉందని కమిటీ అభిప్రాయపడింది.

సుప్రీంకోర్టు సిఫార్సులు ..తదుపరి చర్యలు..

కమిటీ నివేదికను పరిశీలించిన తర్వాత అప్పటి CJI సంజీవ్ ఖన్నా జస్టిస్ యశ్వంత్ వర్మను స్వచ్ఛందంగా రాజీనామా చేయమని కోరారు. అయితే జస్టిస్ వర్మ దానికి నిరాకరించారు. దీంతో కమిటీ నివేదికను రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి పంపి అభిశంసన ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా సిఫార్సు చేశారు.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన జస్టిస్ వర్మ 

తనపై అభిశంసన చర్యలు ప్రారంభమయ్యే అవకాశమున్న క్రమంలో జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన చర్యలు, అలాగే త్రిసభ్య కమిటీ నివేదికను ఆయన సవాల్ చేశారు.

జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వచ్చే వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో  వర్మపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. వర్మ కేసు భారత న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనంపై చర్చకు దారితీసింది.