ఇన్వెస్టిగేషన్ పూర్తికాకుండానే నిందలా?..పైలట్ల సంఘం ఫైర్

ఇన్వెస్టిగేషన్ పూర్తికాకుండానే నిందలా?..పైలట్ల సంఘం ఫైర్
  • ది ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియన్‌‌ పైలట్ల సంఘం ఫైర్
  • ఎయిరిండియా ఘటనలో పైలెట్లను దోషులుగా చేసే ప్రయత్నం చేస్తున్నరు
  • ఏఏఐబీ నివేదిక బయటపెట్టిన విధానంపై అసహనం

న్యూఢిల్లీ: గుజరాత్ అహ్మదాబాద్​లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నదని, అది పూర్తి కాకుండానే పైలెట్లపై నిందలు వేయడం సరికాదని ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలెట్ల (ఎఫ్ఐపీ) సంఘం మండిపడింది. ఈ మేరకు ఎఫ్ఐపీ ప్రకటన విడుదల చేసింది. ప్రాథమిక దర్యాప్తులోని అంశాలు, విమాన ప్రమాదంపై వస్తున్న కామెంట్లపైనా మండిపడింది. 

దర్యాప్తు నుంచి పైలెట్స్ అసోసియేషన్ ప్రతినిధులను ఎందుకు దూరంగా ఉంచారని ప్రశ్నించింది. ప్రిలిమినరీ రిపోర్టును బహిర్గతం చేసిన విధానంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కాక్​పిట్ వాయిస్ రికార్డర్​లో ఎంచుకున్న అంశాలను మాత్రమే ప్రస్తావించడాన్ని ఎఫ్ఐపీ తప్పుబట్టింది. ఇండియా ఎయిర్‌‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) నివేదికలో పైలెట్లను దోషులుగా చిత్రీకరించే విధానాన్ని వ్యతిరేకించింది. దర్యాప్తు పూర్తిగాకముందే తీర్మానాలు చేయడం సరికాదని హెచ్చరించింది. 

ఇలాంటి వైఖరితో ప్రయోజనం లేదని, ఇప్పుడే ఓ నిర్ణయానికి రావొద్దని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలెట్ల (ఎఫ్ఐపీ) సంఘం ప్రజలను కోరింది. అసలు పారదర్శకత, డేటా ఆధారిత, సమగ్ర దర్యాప్తు జరగకుండానే నిందను మోపడం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడింది. అలాంటి కామెంట్లు అత్యున్నత స్థాయి శిక్షణ పొందిన సిబ్బంది ప్రొఫెషనలిజాన్ని దెబ్బతీస్తాయని తెలిపింది. 

దీంతో పాటు వారి కుటుంబసభ్యులు, బంధువులను అనవసరమైన బాధకు గురిచేస్తాయని వివరించింది. ప్రాథమిక నివేదిక సహజంగానే ఎలాంటి సమాధానాలు అందించదని.. మరిన్ని ప్రశ్నలు లేవనెత్తిందని పేర్కొన్నది. దర్యాప్తు పూర్తయ్యేవరకు సంయమనం పాటించాలని కోరింది. 

ఎయిరిండియా 171 ఫ్లైట్ కెప్టెనే ఫ్యూయెల్ స్విచ్‌‌ను షట్‌‌డౌన్‌‌ చేశారని వాల్‌‌స్ట్రీట్‌‌ జర్నల్‌‌ పేపర్​లో ఉటంకిస్తూ కథనం ప్రచురించడాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలెట్ల (ఎఫ్ఐపీ) సంఘం ఖండించింది. ఈ వ్యవహారంలో మీడియా కూడా అతి చేస్తున్నదని మండిపడింది. తప్పుడు వార్తలతో ప్రజలను డైవర్ట్ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది.