బ్రిటన్ ఆరోగ్య మంత్రికి కరోనా.. 

బ్రిటన్ ఆరోగ్య మంత్రికి కరోనా.. 
  • రెండు డోసులు వేసుకున్నా సోకిన కరోనా
  • ఐసొలేషన్ లో ప్రధాని బోరిస్ జాన్సన్

లండన్: కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్లు కనిపించిన బ్రిటన్ లో కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. స్వయంగా బ్రిటన్ ఆరోగ్యమంత్రికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. రెండు డోసులు వేసుకుని ధీమాగా ఉన్న బ్రిటన్ ఆరోగ్యశాఖా మంత్రి సాజిద్ జావిద్ కరోనా బారిన పడ్డారు. దీంతో మంత్రివర్గ సహచరులందరూ జాగ్రత్తలు పాటించాలంటూ హితవు పలికిన ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదివారం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు.
 బ్రిటన్ చట్టాల ప్రకారం కరోనాబారిన పడ్డ వారిని కలిసిన వ్యక్తులు పది రోజులపాటు ఐసొలేషన్ లో ఉండాలి. ఈ లెక్కన బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్ ను కలిసిన వారంతా ఐసొలేషన్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్య మంత్రికి కరోనా సోకిన విషయం నిర్ధారణ అయిన వెంటనే ప్రధాని బోరిస్ జాన్సన్ స్పందించారు. విధులు లేనప్పుడు ఐసొలేషన్ లో ఉంటారని.. మిగతా సమయంలో తన కార్యాలయంలో అత్యవసర విధుల్లో మాత్రమే పాల్గొటారని ప్రధాన మంత్రి కార్యాలయ వర్గాలు ప్రకటించడం దుమారం రేపింది. ప్రధానికి ప్రతిరోజు కరోనా టెస్టులు చేస్తామంటూ ప్రకటించగా తీవ్ర విమర్శలురావడంతో ప్రధాని బోరిస్ జాన్సన్ యూటర్న్ తీసుకుని ఐసొలేషన్ కు వెళ్లిపోయారు.
మిగిలిన మంత్రుల్లో కూడా ఎవరెవరు ఆరోగ్యమంత్రిని కలిశారన్నది ఆరా తీస్తూ అందర్నీ ఐసొలేషన్ కు వెళ్లమని సూచిస్తున్నారు. దీంతో బ్రిటన్ మంత్రివర్గంలో కరోనా ప్రభావంతో చాలా మంది ఐసొలేషన్ కు వెళ్లాల్సిన పరిస్థితి రావడం కలకల రేపుతోంది. కరోనా ఆంక్షలు దశలవారీగా ఎత్తేస్తున్న తరుణంలో మళ్లీ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాక్సిన్లు రెండు డోసులు వేసుకున్నా కరోనా సోకుతుండడం గుబులు రేపుతోంది.