జలియన్ వాలాబాగ్ అమరవీరులకు బ్రిటన్ హైకమిషనర్ నివాళి

జలియన్ వాలాబాగ్ అమరవీరులకు బ్రిటన్ హైకమిషనర్ నివాళి

జలియన్ వాలాబాగ్ దురాగతానికి వందేళ్లు పూర్తైన సందర్భంగా నివాళులర్పించారు బ్రిటన్ హైకమిషనర్ సర్ డొమినిక్ అస్కిత్. అమృత్ సర్ వెళ్లిన డొమినిక్… బాగ్ కు వెళ్లి అమరవీరుల స్మారకం దగ్గర నివాళులర్పించారు. సందర్శకుల పుస్తకంలో తన సందేశం రాశారు. చరిత్రను మార్చలేమన్న డొమినిక్ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవడమే ఉత్తమం అన్నారు.

భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో అత్యంత చీకటి ఘట్టం జలియన్ వాలా బాగ్ దురంతం. ఆ ఘటన జరిగి ఇవాళ్టికి వందేళ్లు పూర్తైంది.  జనరల్ డయ్యర్, మైఖేల్ ఒడయ్యర్ ల రాక్షసత్వానికి వందల మంది బలైన దుర్మార్గపు ఘటన అది. 1919లో బ్రిటీష్ ప్రభుత్వం రౌలత్ చట్టం తీసుకొచ్చింది. దాని ప్రకారం ఏ వ్యక్తినైనా విచారణ లేకుండా, కోర్టు తీర్పు చెప్పకుండా ప్రభుత్వం నిర్బంధించొచ్చు. దీంతో జాతీయవాదులు రౌలత్ సత్యాగ్రహం చేపట్టారు. ఎక్కడ చూసిన సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ప్రదర్శనలు, హర్తాళ్లు. ఆందోళనను అణచాలని భావించిన బ్రిటీష్ ప్రభుత్వం మహాత్మా గాంధీని అరెస్టు చేసింది. పంజాబ్ లో ముఖ్య నాయకులు సైఫుద్దీన్ కిచ్లూ, డాక్టర్ సత్యపాల్ లను అరెస్ట్ చేసి రహస్య ప్రదేశానికి తీసుకెళ్లింది. దానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు అమృత్ సర్ ప్రజలు 1919 ఏప్రిల్ 13 వైశాఖీ పండుగ రోజున జలియన్ వాలాబాగ్ లో సభ నిర్వహించారు. వేలాదిగా పిల్లాపాపలు, ముసలివాళ్లు, మహిళలు కుటుంబ సమేతంగా బాగ్ కు వెళ్లారు.

6.5 ఎకరాల స్థలంలో ఉన్న జలియన్ వాలాబాగ్ కు..  లోపలికి వెళ్లాలన్నా… బయటకు రావాలన్నా ఒకటే దారి. సాయంత్రం నాలుగున్నరకు సభ ఉన్నట్టు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ డయ్యర్ కు తెలిసింది.  దీంతో  మైఖేల్ ఆదేశాలతో.. బాగ్ కు వెళ్లిన బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ కాల్పులు జరిపించాడు. గోడదూకి పారిపోదామనుకున్న వారినీ వదల్లేదు. కాల్పుల నుంచి తప్పించుకోడానికి కొందరు బాగ్ లోని బావిలో దూకినా ప్రాణాలు కోల్పోయారు. అధికారిక లెక్కల ప్రకారం 379 మంది చనిపోయారు. అయితే 1500 మందికి పైగా చనిపోయారని నాటి ఉద్యమకారుడు స్వామి శ్రద్దానంద్ గాంధీకి రాసిన లేఖలో తెలిపారు.

బాగ్ మారణకాండకు కారకులు ఇద్దరు డయ్యర్లు. ఒకరు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ డయ్యర్. మరొకరు అమృత్ సర్ బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్. వీరిద్దరిని బ్రిటీష్ ప్రభుత్వం శిక్షించలేదు సరికదా సన్మానించింది. ఓ డయ్యర్ ను విధుల నుంచి తప్పించి ఇంగ్లండ్ పంపింది బ్రిటిష్ ప్రభుత్వం. జనరల్ డయ్యర్ ను ప్రశంసలు, నగదు బహుమతులతో పంపించింది. తర్వాత అక్కడే అనారోగ్యంతో అతడు మరణించాడు. లెఫ్టినెంట్ గవర్నర్ ఓ డయ్యర్ ను 1940 మార్చి 13న లండన్ లోని కాక్స్టన్ హాల్ లో ఉద్ధమ్ సింగ్ కాల్చి చంపి పోలీసులకు లొంగిపోయాడు. జూలై 31న ఇంగ్లండ్ లో ఉద్ధమ్ ను ఉరితీశారు. జలియన్ వాలా బాగ్ ఊచకోతకు వందేళ్లు పూర్తైన సందర్భంగా… అమృత్ సర్ లో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, గవర్నర్ తో కలసి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఆనాటి అమరవీరులకు నివాళులర్పించారు.