
- ఇప్పటికీ నిలకడగావరద ప్రవాహాలు
- గోదావరికి ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ఇన్‌ఫ్లో
- ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోఆ ప్రాజెక్టులన్నీ నిండే చాన్స్
హైదరాబాద్, వెలుగు: భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుతున్నాయి. దీంతో వానాకాలం ప్రాజెక్టుల కింద సాగుకు ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. ఇప్పటికే కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. ఇప్పటికీ ప్రాజెక్టులకు వరద నిలకడగా కొనసాగుతున్నది. మరోవైపు గోదావరికీ ఇప్పుడిప్పుడే వరద మొదలవుతున్నది. ప్రధాన ప్రాజెక్టుల్లోకి ఇన్‌ఫ్లోస్ వచ్చి చేరుతున్నాయి. వాటితోపాటు స్థానికంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో మీడియం ప్రాజెక్టుల్లోకి కూడా ఫ్లడ్ కొనసాగుతున్నది. ఇటు చెరువులు కూడా అలుగులు దుంకుతున్నాయి. దీంతో ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకైతే ఎలాంటి ఢోకా ఉండబోదని ఇరిగేషన్ శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్‌లో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉండడంతో ఇన్‌ఫ్లోస్ కొనసాగుతాయని, గోదావరి ప్రాజెక్టులు కూడా ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారంకల్లా నిండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
కృష్ణాలో దండిగా నీళ్లు..
కృష్ణా ప్రాజెక్టులకు ఈసారి జూన్ చివరి వారం నుంచే వరద ప్రవాహాలు మొదలయ్యాయి. ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. శ్రీశైలంలో 200 టీఎంసీలదాకా నీళ్లుండగా.. నాగార్జునసాగర్‌లో 300 టీఎంసీలకుపైగా జలాలున్నాయి. జూరాల కూడా నిండుకుండలా మారింది. ఇప్పటికీ ఆయా ప్రాజెక్టులకు వరద కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుతం జూరాలకు 80 వేల క్యూసెక్కులదాకా ఇన్‌ఫ్లోస్ నమోదవుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇటు జూరాలతోపాటు అటు తుంగభద్ర, సుంకేశుల నుంచి వరద వస్తుండడంతో 1.72 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లోస్ ఉన్నాయి.
సాగర్‌కు కూడా అంతే మొత్తంలో వరద వస్తున్నది. అయితే, కుడి కాల్వ ద్వారా ఏపీ 1,540 క్యూసెక్కులు తీసుకెళ్తున్నా.. ఎడమ కాల్వ కింద నీటిని విడుదల చేయలేదు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ 20 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా నుంచి 2,800 క్యూసెక్కులను తరలిస్తున్నది. కల్వకుర్తి లిఫ్ట్ నుంచి మొన్నటిదాకా లిఫ్ట్ చేసిన కొద్దోగొప్ప నీళ్లను కూడా ఇప్పుడు క్లోజ్ చేశారు. ఇక, కృష్ణా ప్రాజెక్టుల కింద ప్రస్తుతానికి 18 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని నిర్ణయించారు. కృష్ణా ప్రాజెక్టుల కింద దాదాపు 130 టీఎంసీలు వాడుకునేందుకు అవకాశం ఉన్నది.
గోదావరికి కొంచెం పెరిగిన వరద
గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు ఇప్పుడిప్పుడే వరద కొంచెం కొంచెం పెరుగుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నిలకడగా వరద ప్రవాహం ఉన్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 13,910 క్యూసెక్కుల వరద వస్తున్నది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కడెం ప్రాజెక్టుకు ఫ్లడ్ కొంచెం తగ్గింది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు 3,500 క్యూసెక్కుల వరద వస్తున్నది. ఎల్లంపల్లికి 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోస్ ఉన్నాయి. దీంతో గాయత్రి పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు.
గోదావరిలో వరద ప్రవాహాలు లేకపోవడంతో ప్రస్తుతానికి ఆయా ప్రాజెక్టుల కింద 4.71 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని ఇప్పటికే స్కివమ్ కమిటీ మీటింగ్‌లో నిర్ణయించారు. ఎస్సారెస్పీ స్టేజ్– 1 కింద 2.34 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని నిర్ణయించగా.. కాకతీయ, సరస్వతి కాల్వల ద్వారా వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం గోదావరిలో వాడుకునేందుకు వీలుగా 50 టీఎంసీల వరకు నీటి లభ్యత ఉన్నది. వరద ప్రవాహాలను బట్టి మరోసారి స్కివమ్ కమిటీ మీటింగ్ నిర్వహించి నీళ్లిచ్చే ఆయకట్టును సవరించాలని అధికారులు భావిస్తున్నారు.