
- పహల్గాం ఉగ్రదాడికి గట్టిగా బదులిచ్చినం: రాష్ట్రపతి ముర్ము
- దేశాన్ని విడగొట్టాలని చూసిన వారికి గుణపాఠం నేర్పాం
- రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ సత్తా చాటినం
- 79వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగం
న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ సిందూర్’ చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి భారత్ గట్టిగా బదులిచ్చిందని, శత్రు దేశం ఆశ్రయం ఇస్తున్న ఉగ్ర శిబిరాలను మన బలగాలు ధ్వంసం చేశాయని చెప్పారు. అంతేకాకుండా రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధించిన దేశం (ఆత్మనిర్భర్ భారత్) గా ఆపరేషన్ సిందూర్ నిరూపించిందన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని గురువారం జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు.
టెర్రరిజంపై పోరులో ఆపరేషన్ సిందూర్ ఒక ల్యాండ్ మార్క్ అని అభివర్ణించారు. దేశాన్ని విడగొట్టాలని చూసిన వారికి గుణపాఠం నేర్పామని పేర్కొన్నారు. ‘‘సాధారణంగా భారత్ ఒకరి జోలికి పోదు. కానీ, తన జోలికి వచ్చిన వారిని మాత్రం భారత్ వదలదు. ఇదే విషయాన్ని ఆపరేషన్ సిందూర్ పై ఏర్పాటు చేసిన మన ఎంపీల బృందాలు వివిధ దేశాలకు వివరించాయి. ఇది నయా భారత్. అంతేకాకుండా రక్షణ రంగంలో మనం ‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా శరవేగంగా పయనిస్తున్నాం. చాలా వరకు ఆయుధాలు దేశీయంగా తయారు చేసినవే” అని ముర్ము తెలిపారు.
అన్ని వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు అందాలి
అన్ని వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు అందాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అప్పుడే అభివృద్ధికి ఒక అర్థం ఉంటుందన్నారు. సామాన్యుల జీవితాలు మెరుగుపరిచేందుకు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు. ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉద్దేశం ఇదే కావాలని సూచించారు. డిజిటల్ ఇండియాపై మాట్లాడుతూ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇండియా అద్భుతమైన ప్రగతిని సాధించిందన్నారు. ‘‘నేడు దేశంలోని దాదాపు అన్ని గ్రామాల్లోనూ 4జీ మొబైల్ కనెక్టివిటీ సౌకర్యం ఉంది.
దీంతో నగరాలు, పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ డిజిటల్ పేమెంట్లు భారీగా పెరిగాయి. డిజిటల్ పేమెంట్ లో కొద్ది కాలంలోనే ఇండియా వరల్డ్ లీడర్ గా ఎదిగింది. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లతో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ లబ్ధిదారులకూ మేలు కలిగింది. దీంతో మధ్యవర్తుల జోక్యానికి చెక్ పడింది. ప్రపంచంలో జరిగే డిజిటల్ పేమెంట్లలో సగం మన దేశానివే” అని ముర్ము పేర్కొన్నారు. 2047లోపు అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు భారత్ వడివడిగా అడుగులు వేస్తున్నదన్నారు.
55 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్
‘ఆయుష్మాన్ భారత్’ స్కీం ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ కేర్ స్కీం అని ముర్ము అన్నారు. దేశంలోని 55 మంది లబ్ధిదారులు ఈ స్కీంతో లబ్ధి పొందుతున్నారని ఆమె చెప్పారు. అంతేకాకుండా 70 ఏండ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు కూడా ఈ పథకాన్ని ప్రభుత్వం విస్తరించిందన్నారు. అవినీతి ఇంకా తొలగిపోలేదని, దానిని కూకటివేళ్లతో పెకలించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే గత వారం జరిగిన జాతీయ చేనేత ఉత్సవాలపైనా ముర్ము మాట్లాడారు. ప్రతిఒక్కరూ దేశీయ ఉత్పత్తులను కొనే వాడుదామని తీర్మానించుకోవాలని పిలుపునిచ్చారు.