బీఆర్కే ఉద్యోగులకే !

బీఆర్కే ఉద్యోగులకే !
  • అధికారులను ఒత్తిడిచేసి తరలించిన సర్కారు
  • బీఆర్కే భవన్ దిక్కు చూడని మంత్రులు
  • ఫస్ట్​ ఫ్లోర్​లో 9 మంది మినిస్టర్లకు చాంబర్లు
  • ఇరుకు గదులు సరిపోవంటూ నేతలు దూరం 
  • కమిషనరేట్లు, హెచ్​వోడీ ఆఫీసుల్లో ఉండేందుకే మొగ్గు
  • సీఎం ముందు ప్రతిపాదన ఉంచే ఆలోచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పాలనకు కొత్త కేంద్రంగా మారిన బీఆర్కే భవన్ ఉన్నతాధికారులు, ఉద్యోగులకే పరిమితం కానుంది. రాష్ట్ర మంత్రులు ఎవరూ ఇక్కడికి రావడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. బీఆర్కే భవన్  నుంచి పాలన మొదలుపెట్టాలని సర్కారు తొందరపడుతున్నా ఆ భవనం సరిగా లేకపోవడంతో బాగా లేటైంది. చాలా రిపేర్లు అవసరం కావడంతో ఇప్పటికీ పనులు కొనసాగుతున్నాయి. అయితే షిఫ్టింగ్ ఆలస్యం కావడంపై గత వారం సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్కేభవన్ నుంచే పాలన మొదలు కావాలని ఆదేశించారు. దీంతో అక్కడ సరిగా ఏర్పాట్లు లేకపోయినా షిఫ్టింగ్ పనులు కొనసాగించారు. ఉద్యోగులతో పాటు కొందరు ఉన్నతాధికారులు కూడా మంగళవారమే బీఆర్కే భవన్ లో డ్యూటీ మొదలుపెట్టారు. అయితే వాళ్లతో పాటు విధుల్లో చేరాల్సిన మంత్రులు మాత్రం భవన్ దిక్కు రాలేదు.

మంత్రులు ఎందుకు రావట్లే?

బీఆర్కే భవన్​లో ఉండటానికి రాష్ట్ర మంత్రులు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఇరుకు గదులు ఉండడం, కనీసం మీటింగ్​లు పెట్టుకోవడానికి కూడా సరిపడా జాగా లేకపోవడం వారికి సమస్యగా మారింది. ఇప్పుడున్న సెక్రటేరియెట్​లోని 80 శాతం శాఖలను, మంత్రుల చాంబర్లను బీఆర్కే భవన్​కు తరలించాలని సర్కారు నిర్ణయించింది. మొత్తం 11 మంది మంత్రుల్లో ఇద్దరికి వారి శాఖల కమిషనరేట్లలో ఉండేందుకు అవకాశం ఇచ్చారు. మిగతా తొమ్మిది మందికి బీఆర్కే భవన్​ఫస్ట్​  ఫ్లోర్​ను కేటాయించారు. అయితే ఇప్పటివరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మినహా మరెవరూ కనీసం ఇక్కడికి వచ్చి చూసినవాళ్లు లేరు.  బీఆర్కే భవన్ లో 9 ఫ్లోర్లు ఉంటే ఫస్ట్ ఫ్లోర్ మినహా మిగతా అన్ని ఫ్లోర్లలో రిపేర్లు ఇంకా నడుస్తున్నాయి. సర్కారు ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో ఓ దిక్కు రిపేర్లు నడుస్తుంటే ఇంకో దిక్కు శాఖల షిఫ్టింగ్ పనులు అవుతున్నాయి. ఫస్ట్​ ఫ్లోర్ లో రిపేర్లు ఇప్పటికీ మొదలు కాకపోవడానికి కారణం మంత్రులు ఇష్టపడకపోవడమే అని తెలుస్తోంది. ప్లేస్ తక్కువగా ఉండడంతో పాటు వాస్తు మార్పులకు కూడా అవకాశం లేదని, అందుకే వారు ఆసక్తి చూపించట్లేదని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. ఇన్నాళ్లూ ఫస్ట్​ ఫ్లోర్​లో  మార్కెటింగ్​ శాఖ కార్యాలయం ఉండేది. దాన్ని ఎల్​బీనగర్​కు తరలిస్తున్నారు. ఆ సామాగ్రి పూర్తిగా తరలించాక రిపేర్లు మొదలుపెడతారని చెబుతున్నారు.

రెండేండ్లూ సర్దుకుపోవాలా?

సెక్రటేరియెట్​లో మంత్రులకు ఆఫీసులతో పాటు పీఎస్ లకు, ఓఎస్డీలకు ప్రత్యేక చాంబర్లు, వెయిటింగ్ రూంలు ఉండేవి. బీఆర్కే భవన్ లో ఆ పరిస్థితి లేదు. చాలా భవనాల్లో వేర్వేరుగా ఉన్న శాఖల్లో 80 శాతాన్ని ఒకే భవనంలోకి తేవడంతో అంతా ఇరుకిరుకుగా మారుతోంది. మంత్రులకు కూడా అలాంటి చాంబర్లే ఇవ్వాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు ఇటీవలి వర్షాలకు భవన్ లో గోడలు ఉరిసి ఇంకా అధ్వానంగా తయారైంది. ఈ పరిస్థితుల మధ్య ఎలాంటి సౌకర్యాలు లేకుండా మంత్రులు పనిచేయాల్సి ఉంది. కొత్త సెక్రటేరియట్ ఏడాదిలో పూర్తవుతుందని, అప్పటవరకు సర్దుకుపోవాలని సర్కారు చెబుతోంది. అయితే కొత్త భవనం పనులు మొత్తం కావడానికి ఏడాదిన్నర నుండి రెండేండ్లు పట్టే అవకాశం ఉందని, అంతకాలం బీఆర్కే భవన్ లో ఉండడం కష్టమేనని మంత్రులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రోజూ తమను కలవడానికి వచ్చే ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కంపెనీల ప్రతినిధులు, జడ్పీచైర్మన్లు, లోకల్ నాయకులను కలవడానికి ఇబ్బంది అవుతుందని వారు అనుకుంటున్నారు.

కమిషనరేట్ల వైపే మొగ్గు

సెక్రటేరియెట్ షిఫ్టింగ్ లో ఇద్దరు మంత్రులకు బీఆర్కేభవన్ లో కాకుండా బయట ఆఫీస్ దక్కింది. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్​ బీ ఈఎన్సీ కార్యాలయానికి షిఫ్ట్​ అయ్యారు. దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముందుగా అరణ్య భవన్ కు షిఫ్ట్​ కావాలని భావించారు. అయితే అక్కడ ఉన్న ఏపీ అధికారులు గదులు అప్పగించకపోవటంతో బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనరేట్ కు మంగళవారం షిఫ్ట్​ అయ్యారు. మిగతా తొమ్మిది మంది మంత్రులు బీఆర్కే భవన్​లోకి ఇంకా షిఫ్ట్ కాలేదు. వాళ్లంతా తమ కమిషనరేట్లు, హెచ్ వోడీ ఆఫీసుల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్ లోని రంగారెడ్డి జడ్పీ ఆఫీసులోకి షిఫ్టు కావాలనే ఆలోచనతో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ భవనాన్ని పరిశీలించినట్లు సమాచారం. తన మీటింగ్ లను చాలావరకు రంగారెడ్డి జడ్పీ ఆఫీస్ నుంచే నిర్వహిస్తానని ఎర్రబెల్లి మీడియా ప్రతినిధులతో చెప్పారు. హోంమంత్రి మహమూద్ అలీ లక్డీకాపూల్ లోని డీజీపీ ఆఫీసుకు షిఫ్ట్​ అయ్యే అవకాశాలు ఉందని సిబ్బంది చెబుతున్నారు. బీఆర్కే భవన్​కాకుండా తమ శాఖల కమిషనరేట్లలోకి, హెచ్​వోడీ ఆఫీసుల్లోకి పోవడానికి అనుమతివ్వాలని మంత్రులు త్వరలో సీఎంను కలవనున్నట్లు సమాచారం. వాటిలో అయితే సమావేశాలకు, విజిటర్లను కలవడానికి ఇబ్బంది ఉండదని వారు భావిస్తున్నారు.

ఇటు షిఫ్టింగ్.. అటు రిపేర్లు

బీఆర్కే భవన్ లో ఓ వైపు మరమ్మతులు జరుగుతుంటే మరోవైపు కొందరు పెద్దాఫీసర్లు భవన్లోని తమ చాంబర్లలోకి అడుగుపెట్టారు. సెక్రటేరియెట్ నుంచి సామగ్రిని తరలించే పనులు కొనసాగుతున్నాయి. జీఏడీ ఫైళ్లను పాతవి, కొత్తవి, రన్నింగ్ లో ఉన్నవి ఇలా మూడు రకాలుగా వేరు చేసి ప్యాక్ చేసి తరలిస్తున్నారు. మిగతా శాఖల ఫైళ్లను సామగ్రిని సర్దే పనిలో ఉన్నారు. మంగళవారం ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్  ఐదో ఫ్లోర్ లోని తన చాంబర్లో పూజలు చేసి ప్రవేశించారు.  వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు  కూడా బీఆర్కే లోని తమ ఆఫీసుల్లోకి డ్యూటీలో చేరారు.

రిపేర్లయ్యేదాకా సీఎస్ వర్క్ ఫ్రం హోం

మంగళవారం పొద్దున సీఎస్ ఎస్కే జోషి బీఆర్కే భవన్​9వ ఫ్లోర్ లో తన చాంబర్ ను  పరిశీలించారు. ఆయనతో జీఏడీ ముఖ్యకార్యదర్శి అధర్​ సిన్హా కూడా ఉన్నారు. ఆ ఫ్లోర్​లో రిపేర్ల వివరాలు తెలుసుకున్నారు. మరమ్మతులు అయ్యే దాకా కుందన్ బాగ్ లోని తన ఇంటి నుంచే సీఎస్​ విధులు నిర్వర్తించనున్నారు.