
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలను గోదావరి రివర్ మేనేజ్ మెంట్ టీం మంగళవారం తనిఖీ చేసింది. ఎస్సారెస్పీ నుంచి మిగులు జలాలను గోదావరిలోకి వదిలే 42 గేట్లను పరిశీలించి, నీటి విడుదల సామర్థ్యాన్ని అధికారులు అడిగి తెలుసుకున్నారు. గోదావరి రివర్ నీటి విడుదల సామర్థ్యం తెలిపే సొన్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన టెలిమీటర్ పనితీరును పరిశీలించారు. ప్రాజెక్టు ఆయకట్టుకు నీరును విడుదల చేసే వరద కాలువ హెడ్ రెగ్యులేటర్, కాకతీయ కాలువ, లక్ష్మీ కాలువ, సరస్వతీ కాలువ స్థితిగతులు, నీటి విడుదల వివరాలను ఎస్సారెస్పీ అధికారులను వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంప్‌హౌస్ లో రివర్స్ పంప్, ప్రాజెక్ట్ నమూనాను పరిశీలించారు.