చైనాకు గట్టి కౌంటర్  

చైనాకు గట్టి కౌంటర్  
  • లడఖ్​లో ఎల్ఏసీ వెంబడి నిర్మిస్తున్న కేంద్రం 
  • రెండేండ్లలో పూర్తి.. చైనాకు గట్టి కౌంటర్  

న్యూఢిల్లీ: ఇండో–చైనీస్ బార్డర్​కు సమీపంలో కొత్త ప్రాజెక్టులు, రోడ్లు, నిర్మాణాలు చేపడుతూ కవ్వింపులకు పాల్పడుతున్న చైనాకు గట్టిగా కౌంటర్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం హైవే నిర్మాణం చేపట్టింది. లడఖ్ లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వెంబడి 135 కిలోమీటర్ల పొడవున హైవే నిర్మాణానికి రక్షణ శాఖకు చెందిన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా హైవే నిర్మాణం కోసం తాజాగా బిడ్లను ఆహ్వానించింది. ఈ హైవేను రెండేండ్లలో  పూర్తి చేయనున్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. లడఖ్ లో ఎల్ఏసీ వెంబడి బార్డర్ కు దగ్గరగా ఉన్న చుషుల్ నుంచి డేమ్ చుక్ వరకూ ఈ హైవేను నిర్మించనున్నారు.

రెండు దేశాల మధ్య ఉన్న పాంగాంగ్ లేక్ కు దక్షిణాన ఉన్న చుషుల్ నుంచి.. ఉత్తరాన బార్డర్ కు సమీపంలో ఉన్న చివరి ఇండియన్ విలేజ్ డేమ్ చుక్ వరకూ హైవే ఏర్పాటు కానుంది. మధ్యలో డూంగ్రీ, ఫక్చే ప్రాంతాలను ఇది కనెక్ట్ చేయనుంది. సింధు నదికి సమాంతరంగా ఉండే ఈ రూట్ లో ప్రస్తుతం మట్టి రోడ్డు మాత్రమే అందుబాటులో ఉంది. హైవే నిర్మాణం పూర్తయితే బార్డర్ కు వేగంగా బలగాలను రవాణా చేసేందుకు వీలు కానుండటంతో చైనాకు గట్టి కౌంటర్​గా ఇది నిలవనుంది.