
- అమెరికా నుంచి తండ్రికి డబ్బులు పంపిన కూతురు
- బైంసా టౌన్ లోని బ్యాంకులో డ్రా చేసుకుని వెళ్తుండగా ఘటన
బైంసా, వెలుగు: నిర్మల్‌జిల్లా బైంసా టౌన్ లో పట్టపగలు చోరీ జరిగింది. ముథోల్ మండలం ఎడ్ బిడ్ గ్రామానికి చెందిన బొంబోతుల ఆనంద్ కు అమెరికా నుంచి తన కూతురు డబ్బులు పంపించింది. సోమవారం ఉదయం డ్రా చేసుకునేందుకు స్కూటీ పై అతడు బైంసాకు వెళ్లాడు. యూనియన్ బ్యాంక్ నుంచి రూ.5 లక్షలు డ్రా చేసిన అనంతరం స్కూటీ డిక్కీలో పెట్టుకుని వెళ్తున్నాడు. కొద్దిదూరం వెళ్లాక వివేకానంద చౌక్‌లోని సాయి లక్ష్మీ రెస్టారెంట్వద్ద స్కూటీని ఆపి భోజనం చేసేందుకులోనికి వెళ్లాడు.
అదే సమయంలో ఇద్దరు ఆగంతకులు బైక్ పై అక్కడికి వచ్చారు. ఒకరు స్కూటీ వద్దకు వెళ్లి డిక్కీ తెరిచి అందులోని డబ్బులను ఎత్తుకెళ్లాడు. భోజనం తిని వచ్చిన ఆనంద్ స్కూటి డిక్కీ తెరిచి ఉండడాన్ని చూసి ఆందోళన చెంది.. తెరిచి చూడగా అందులో డబ్బులు చోరీ అయినట్టు గుర్తించాడు. వెంటనే బాధితుడు రెస్టారెంట్ నిర్వాహకులకు తెలిపి.. అనంతరం పోలీస్‌స్టేషన్ లో కంప్లయింట్ చేశాడు. టౌన్ సీఐ గోపీనాథ్ సిబ్బందితో వెళ్లి రెస్టారెంట్ వద్ద సీసీ పుటేజీలను పరిశీలించారు. దుండగులు బాసర వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ గోపినాథ్ తెలిపారు.