- హెచ్ఎండీఏలో ఐదు నిమిషాల్లో అనుమతులు ఉత్తముచ్చటే
- ఫైల్ ఏ దశలో ఉందో చెప్పని అధికారులు
- ఆఫీసుకు రప్పించుకుంటూ ఏజెంట్ల దగ్గరకు వెళ్లాలని సూచన
- డబ్బులిస్తే చిటికెలో పర్మిషన్లు
హైదరాబాద్‌సిటీ, వెలుగు :హెచ్ఎండీఏలో ఇంకా ఏజెంట్ల హవా కొనసాగుతోంది. భవన నిర్మాణాలు, లేఔట్స్ పర్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు తప్పనిసరిగా ఏజెంట్లను ఆశ్రయించే విధంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు. కొంతకాలం కిందట లే అవుట్లతో పాటు, భూవినియోగ మార్పిడి, కొత్త భవనాల నిర్మాణానికి అనుమతులు వేగవంతంగా జారీ చేసేందుకు హెచ్ఎండీఏ బిల్డ్‌నౌ సిస్టమ్ప్రవేశపెట్టింది. నిర్మాణదారులతో పాటు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేలా ఈ కొత్త టెక్నాలజీని తీసుకువచ్చామని, అంతా ఆన్లైన్కాబట్టి ఆయా విభాగాల్లో అనుమతులు జారీ చేయడానికి లంచాలు తీసుకునే అవకాశం కూడా ఉండదని చెప్పింది. అనుమతులకు రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని, కేవలం 5 నిమిషాల్లోనే పని పూర్తవుతుందని స్పష్టం చేసింది. కానీ, ప్రస్తుత పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది.
ఏజెంట్ల దగ్గరకు వెళ్తేనే పని..
నిర్మాణదారులు బిల్డ్‌నౌ విధానంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని రోజులు గడుస్తున్నా అనుమతులు రావడం లేదు. అప్లై చేసుకున్న తర్వాత ఫైల్ఎంత వరకు వచ్చిందన్నది తెలుసుకోవడానికి రియల్టైమ్ఫాలోఅప్, ఏఐ ఆధారిత ఛాట్సదుపాయాలు వినియోగించుకుంటున్నా వివరాలు సరిగ్గా అందడం లేదు. దరఖాస్తుతో పాటు జత చేసిన డాక్యుమెంట్లు సరిగ్గా లేవని, చిన్న చిన్న లోపాలు ఉన్నాయంటూ తప్పనిసరిగా హెచ్ఎండీఏ ఆఫీసుకు వచ్చేలా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక పని జరగడం లేదని ఆఫీసుకు వెళ్తే ప్లానింగ్విభాగంలో ఏజెంట్లు తిష్ఠ వేసి కూర్చుంటున్నారు.
హెచ్ఎండీఏ ఆఫీసు చుట్టూ పదుల సంఖ్యలో కన్సల్టెన్సీలు (ఏజెంట్ల ఆఫీసులు) ఉన్నాయి. వీటిలో పనిచేసే సిబ్బంది..హెచ్ఎండీఏలోని ఉన్నతాధికారులతో పాటు ప్లానింగ్విభాగంలోని ఆఫీసర్లతో టచ్‌లో ఉంటున్నారు. పని కాలేదని అధికారుల దగ్గరకు వచ్చిన క్లయింట్‌ను ఫలానా ఏజెంట్‌ను కలవాలని సూచిస్తున్నారు.
దీంతో వారు చెప్పినట్టే కలిస్తే ఫైల్ఏ దశలో ఉందో చెప్తున్నారు. వారు చెప్పినంత ఫీజు చెల్లిస్తే చిటికెలో పని చేసి పెడుతున్నారు. ఒకవైపు బిల్డ్‌నౌ ద్వారా పర్మిషన్లు నిమిషాల్లోనే ఇస్తామని మాటలు మాత్రమే చెప్తున్నారని, చేతల్లో కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు.
ఎన్వోసీల అనుమతుల్లోనే ఎక్కువ అక్రమాలు
భారీ ప్రాజెక్టులు నిర్మించే బడా బిల్డర్లు, భారీ లేఔట్లను వేసే వారు తప్పనిసరిగా సదరు ల్యాండ్‌కు సంబంధించి ఎన్ఓసీ తీసుకోవాలి. అంటే ఆయా భూములు రెవెన్యూ రికార్డులు ప్రకారం ఉన్నాయా? లేవా? చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్ల పరిధిలో ఉన్నాయా అన్న విషయాలను నిర్ధారిస్తూ రెవెన్యూ, ఇరిగేషన్అధికారులు నోఅబ్జెక్షన్సర్టిఫికెట్లను ఇస్తారు.
వీరు జారీ చేసే ఎన్‌వోసీల్లో చిన్న చిన్న లోపాలు ఉంటున్నాయి. అయితే, హెచ్ఎండీఏ అధికారులు ఇందులో లోపాలు ఏమున్నాయో చెప్పడం లేదు. చివరకు పనులు కావడం లేదని ఆఫీసులకు వస్తుండంతో ఏజెంట్లతో మాట్లాడించి బేరం కుదుర్చుకుంటున్నారు. తర్వాత ఎన్‌వోసీల్లో లోపాలు ఉన్నా గుడ్డిగా అంగీకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా బిల్డ్‌నౌ పద్ధతిలో చెప్పినట్టు అనుమతులు జారీ చేయాలని కోరుతున్నారు.
