
- ఓ యువకుడిని ప్రేమిస్తోందని గొంతు పిసికి, వైరుతో బిగించి హత్య
- కొత్తూరు మండలం పెంజర్లలో ఘటన
షాద్‌నగర్, వెలుగు : తన అక్క ఓ యువకుడితో మాట్లాడుతోందని, అతడిని ప్రేమిస్తోందని కోపం పెంచుకున్న తమ్ముడు ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రుచిత (21), అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమించుకున్నారు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో వారు పెండ్లికి ఒప్పుకోకపోగా.. గ్రామంలో పంచాయితీ పెట్టి తన కూతురి వెంట పడొద్దని యువకుడిని హెచ్చరించారు.
సోమవారం రుచిత తల్లిదండ్రులు బయటకు వెళ్లిన టైంలో ఆమెకు యువకుడు ఫోన్ చేశాడు. రుచిత అతడితో మాట్లాడుతుండడాన్ని ఆమె తమ్ముడు రోహిత్ గమనించాడు. దీంతో అక్కాతమ్ముళ్ల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రోహిత్.. రుచిత గొంతు పట్టుకొని, ఓ వైరును బిగించి హత్య చేశాడు. సాయంత్రం పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు రుచిత చనిపోయి కనిపించడంతో కొత్తూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి రాఘవేందర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.